అద్దె.. చెల్లించేదెలా?
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అద్దె భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అద్దె భవనాల్లో ఉన్న పలు శాఖల కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెలనెలా ప్రభుత్వ కార్యాలయాలకు కడుతున్న అద్దెను ఆదా చేయవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జిల్లా పరిధిలో చాలా చోట్ల పలు శాఖల కార్యాలయాలు రూ.వేలకు వేలు అద్దె చెల్లిస్తూ ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 వరకు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశాలు ఇవ్వడంతోపాటు జనవరి నెల నుంచి అద్దె చెల్లింపులను నిలిపివేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
ఎవరు చెల్లిస్తారు..?
జనవరి 1 నుంచి అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగితే అద్దె చెల్లించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ట్రెజరీ కార్యాలయాన్ని ఆదేశించింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయాలకు సంబంధించి జనవరి నెల అద్దె ఎవరు చెల్లిస్తారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ భారం సంబంధిత శాఖల అధికారులపై పడనుందా.. లేక ప్రభుత్వం ఏమైనా వెసులుబాటు కలిగిస్తుందో వేచిచూడాలి.
ఆదేశాలు వచ్చాయి..
జనవరి నెలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లించరాదని రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీనికి సంబంధించి గతంలో ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే మాత్రమే మంజూరు చేస్తాం. కానీ, ఈ నెల అద్దె చెల్లింపు విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకెళ్తాం.
– రాజుగౌడ్, ఎస్టీఓ
ప్రైవేట్ భవనాలు ఖాళీ చేయాలని గత నెల ప్రభుత్వ ఆదేశాలు
ఇంకా అద్దె గదుల్లోనే కొనసాగుతున్న పలు కార్యాలయాలు
ఇప్పటికే కిరాయి చెల్లింపు నిలిపివేస్తూ జీఓ జారీ
అందుబాటులో ప్రభుత్వ భవనాలు లేక అవస్థలు


