ఉన్నత విద్యకు బాటలు
అభివృద్ధి వైపు పాలమూరు యూనివర్సిటీ పయనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నూతన భవనాలు, అధునాతన ల్యాబ్‌లు, వినూత్న కోర్సులతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యూనివర్సిటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో నిధులు కేటాయింపులు చేయడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి విద్యార్థులకు హాస్టళ్లు, తరగతి, గదులు, ల్యాబ్‌లు, గ్రౌండ్స్ వంటివి లేక సతమతమవయ్యే వారు. కానీ, ఈ సంవత్సరం పెద్దమొత్తంలో నిధుల కేటాయింపుతో భవనాల నిర్మాణానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం ద్వారా ఇచ్చిన నిధులతో పెద్దఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్మాణాల కోసం రూ.35 కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులతో మరిన్ని భవనాల నిర్మాణాలకు అంచనాలు రూపొందిస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి.
రూ.150 కోట్లు కేటాయింపు..
యూనివర్సిటీ ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేవలం సిబ్బంది వేతనాల కోసమే కేటాయింపులు జరిగివి. 2018లో పీయూలో న్యాక్ గ్రేడింగ్ రావడంతో ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేయగా.. పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో సిబ్బంది వేతనాల కోసం గతేడాది రూ.11 కోట్లు, ఈ సంవత్సరం రూ.15 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు కూడా ఇచ్చారు. గతేడాదితో పోల్చితే రూ.4 కోట్లు అదనంగా ఇవ్వడంతో యూనివర్సిటీపై వేతనాల భారం తగ్గనుంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు కేటాయించనప్పటికీ అధికారులు యూనివర్సిటీ అంతర్గత నిధులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి నిధులు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఒకేసారి కేటాయించడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతాయని భావిస్తున్నారు.
యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయింపు ఇలా..
సంవత్సరం ప్రతిపాదనలు కేటాయింపులు
(రూ.కోట్లలో..)
2019– 20 119 6.63
2020– 21 216 7.39
2021– 22 137 7.58
2022– 23 75 9.58
2023– 24 84 10.91
2024– 25 200 50
ఒకే విద్యా సంవత్సరంలో
రూ.150 కోట్లు మంజూరు
పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.50 కోట్లు
కేటాయింపు
లా, ఇంజినీరింగ్ కళాశాలల
భవనాల నిర్మాణంపై దృష్టి
హాస్టల్స్, ల్యాబ్స్ భవనాలను
నిర్మాణానికి శ్రీకారం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గతంలో కేవలం వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ, ఈ సంవత్సరం వేతనాలతో పాటు అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడంతో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్, ల్యాబ్స్ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. లా, ఇంజినీరింగ్ కళాశాల కోసం కూడా భవనాల నిర్మాణం చేపడతాం. విద్యార్థుల చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే విధంగా కొత్త కోర్సులు ప్రారంభించేలా చూస్తాం.
– శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్‌లర్
ఉన్నత విద్యకు బాటలు
ఉన్నత విద్యకు బాటలు


