ములుగు రూరల్: సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ, లాభసాటి వ్యవసాయానికి రైతులు బాటలు వేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క సూచించారు. ఇంచర్ల ఎంఆర్ గార్డెన్‌లో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సౌజన్యంతో శనివారం ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలని చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ములుగు మండలంలోని పొట్లాపూర్‌లో రూ.145 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు అయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిందని చెప్పారు. రూ.35 కోట్ల వ్యయంతో రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువు వరకు గ్రావిటీ కెనాల్ ఏర్పాటుకు భూసేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాల స్టాళ్లను ఆమె పరిశీలించారు. అనంతరం, రాంచంద్రాపురం, లక్నవరం ప్రాంతాలకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల సర్వీసులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సురేష్‌కుమార్, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ రఘు, డివిజన్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా సర్వోత్తంరెడ్డిని గెలిపించండి
ములుగు: పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తంరెడ్డిని గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వోత్తంరెడ్డితో కలిసి సీతక్క మీడియాతో మాట్లాడారు. పట్టభద్రులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వారి హక్కులు, సమస్యలు, ఆకాంక్షలను మండలిలో వినిపించేందుకు సర్వోత్తంరెడ్డిని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.


