ఏటూరునాగారం: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జ్ ఏపీఓ, ఎస్‌డీసీ(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) ప్రతాప్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజనదర్బార్‌లో 12 దరఖాస్తులను ఎస్‌డీసీ ప్రతాప్ స్వీకరించారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం నర్సాపురానికి చెందిన గిరిజనులు తాగునీటి కోసం బోరు నిర్మించాలని కోరారు. మల్లంపల్లి మండలం రామచంద్రపురం బోరు వెల్ మంజూరు చేయాలని వేడుకున్నారు. తాడ్వాయి మండలం నర్సాపూర్‌లో వ్యవసాయ సాగు కోసం గిరివికాస్ కింద బోరు, మోటారు నిర్మించాలని కోరారు. కొత్తగూడ మండలం సాదిరెడ్డి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పాలకుర్తి మండలం దస్రుతండాకు చెందిన గిరిజన విద్యార్థి ఐఐటీలో సీటు వచ్చిందని, ల్యాప్‌టాప్ ఇప్పించాలని కోరారు. పట్వారీపల్లె గ్రామానికి చెందిన గిరిజనుడు ములుగు గురుకుల పాఠశాలలో పీఈటీ కాంట్రాక్టు పోస్టు ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాను ఆన్‌లైన్‌లో ఎక్కించాలని ఓ గిరిజన రైతు కోరారు. వెంకటాపురం(కె) మండలంలోని లక్ష్మీపురంలో బోరు పాయింట్, కరెంటు ఇప్పించాలని గిరిజనుడు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ హెచ్‌డీ సురేశ్ కుమార్, డీడీ ఫిరంగి, జీసీసీ డీఎం వాణి, మహేందర్, కిశోర్, జగన్, శంకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్
గిరిజన దర్బార్‌లో
12 దరఖాస్తుల స్వీకరణ


