పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
వాజేడు: మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మండల పరిధిలోని జగన్నాథపురం పాఠశాల ఆవరణలో ఆదివారం అల్లి అమృత అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వంట కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవలంభిస్తున్న ధోరణి సరైంది కాదన్నారు. కేంద్ర పభుత్వం కేవలం రూ.600 ఇచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచుతామన్న రూ.10 వేల వేతనం విషయం మరుగున పడిందన్నారు. వంట కార్మికులకు ఇస్తున్న మెనూ చార్జీలు ప్రస్తుత ధరలకు అనుకూలంగా లేకపోవడంతో మెనూ అమలు చేయడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ప్రతీ విద్యార్థికి రూ. 25 ఇస్తే రెండు కూరలు, మూడు కోడిగుడ్లు అందించ వచ్చని వివరించారు. 8, 9 నెలల నుంచి వంట, కోడిగుడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన అల్పాహారానికి సంబంధించిన 9 నెలల బిల్లులను ఈ ప్రభుత్వం చెల్లించకపోవడంతో వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి వంట కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతనంగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నాగమణి, ప్రధాన కార్యదర్శిగా సంతోష్‌తో పాటు మరో ఆరుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మంగ, పార్వతి, జయమ్మ, నాగసుధ, లలిత, సరిత, అరుణ, నాగమ్మ, సరోజిని, సమ్మక్క, రాధ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్


