రహస్య పూజా మందిరంపై నిర్లక్ష్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ప్రహరీ పక్కన ఉన్న రహస్య పూజామందిరంపై సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిఏటా మహాజాతర, చిన్న జాతర సమయంలో రహస్య పూజామందిరంలో పూజారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆ మందిరంలోకి సాధారణ వ్యక్తులను పూజారులు అనుమతిచ్చారు. అమ్మవార్లకు పూజారులు సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం అభివృద్ధి పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనుల నేపథ్యంలో రహస్య పూజా మందిరం అడ్డుగా ఉందని తొలగించి రేకులను ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తున్నా పూజా మందిరాన్ని బహిర్గంతంగానే వదిలేయడంతో భక్తులు కాంట్రాక్టర్ తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతర నాటికి రహస్య పూజా మందిరం నిర్మించేనా అనే సందేహాలను పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.


