మళ్లీ కసరత్తు !
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై టీపీసీసీ తుది అభిప్రాయ సేకరణ
సాక్షిప్రతినిధి, వరంగల్:
అర్ధంతరంగా ఆగిపోయిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై టీపీసీసీ మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే డీసీసీ రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్‌లో కార్యాచరణ చేపట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మార్గదర్శకాల మేరకు అక్టోబర్ 11 నుంచి 18 వరకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాల నుంచి 161 మంది డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ మార్గదర్శకాల మేరకు ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్లను తీసుకుని సీఎం, టీపీసీసీ చీఫ్‌కు అందజేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటికేషన్ రావడం, హైకోర్టు స్టేతో రద్దు కావడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా డీసీసీల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం సిద్ధం కావాలని పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే డీసీసీలను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావించి మళ్లీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
‘పారామీటర్’లు పక్కానా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. అధిష్టానం సంస్థాగత పదవులను కీలకంగా చూస్తోంది. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్తోంది. దీంతో డీసీసీ అధ్యక్షుడు జిల్లాస్థాయిలో కీలకం కానున్నారన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో ఇటీవల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఆశావహులు పోటీపడ్డారు. పార్టీ నిబంధనల ప్రకారం.. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం ఐదేళ్లపాటు క్రమశిక్షణతో, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వారై ఉండాలి. అలా... లేని దరఖాస్తులు ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎంపికై న వారిని డీసీసీ పీఠానికి పరిగణనలోకి తీసుకోరని, అలాగే పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అవకాశం కల్పించడం లేదని తేల్చిచెప్పారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏఐసీసీ సూచించిన ఈ పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటే చాలా జిల్లాల్లో డీసీసీ పదవులకు సమర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయం పరిశీలకుల్లో వచ్చింది. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు చాలామందే దరఖాస్తుదారుల్లో ఉన్నా.. అందులో నుంచి ఎంపికై న వారు పార్టీని సమర్థంగా నడిపించగలరా? అనేది ప్రశ్నగా ఉంది. దీంతో ఏఐసీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు డీసీసీలను ఎంపిక చేస్తారా? ఏఐసీసీ గైడ్‌లైన్స్ సడలించి స్థానిక అవసరాలు, ప్రాథమ్యాలను గమనించి నియమిస్తారా? అసలేం జరగనుంది? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
పోటాపోటీగా దరఖాస్తులు..
పార్టీ హైకమాండ్ కార్యాచరణతో డీసీసీ ఎన్నికల కసరత్తుకు రంగంలోకి దిగిన పరిశీలకులకు పోటీపోటీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు అందాయి. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యమన్న ప్రచారం నేపథ్యంలో.. కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్‌రావు, పిన్నింటి అనిల్‌రావు తదితరులు పోటీపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతో పాటు 18 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పరిశీలకులు ప్రకటించారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, మాసాన్‌పల్లి లింగాజీ తదితరులు రేసులో ఉన్నారు. ములుగు జిల్లాకు పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మహబూబాబాద్ నుంచి జె.భరత్‌చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, అంజయ్యతో పాటు 20 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి ఆరు డీసీసీల కోసం 161 దరఖాస్తులు రాగా.. ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్ల చొప్పున 24 మంది పేర్లను ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలనకు పంపారు. ఇందులో నుంచి ఎంపిక చేసేందుకు తాజాగా టీపీసీసీ ముఖ్యనేతల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది.
ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ..
ఒక్కో జిల్లా నుంచి
పరిశీలనలో నలుగురి పేర్లు
‘స్థానిక’, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తాత్కాలికంగా బ్రేక్
నియామకంపై నేటి కేబినెట్‌లో
చర్చించే అవకాశం


