ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్‌ X రెవెన్యూ | Sakshi
Sakshi News home page

ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్‌ X రెవెన్యూ

Published Fri, Apr 7 2023 1:50 AM

మల్లంపల్లి–జాకారం మధ్యలో నిలిచిపోయిన ఎన్‌హెచ్‌ పనులు - Sakshi

ములుగు: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆరెపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు రావడంతో సంబంధిత శాఖ టెండర్‌ పిలిచి పనులు చేపట్టింది. ములుగు మండల పరిధిలోని మహ్మద్‌గౌస్‌ పల్లి నుంచి మల్లంపల్లి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కెనాల్‌ వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

జాకారం ఫారెస్ట్‌ కంపార్ట్‌మెంట్‌ 598, 599, 680 పరిధిలోని కెనాల్‌ నుంచి జాకారం సాంఘీక సంక్షేమ గురుకులం పక్కన ఉన్న నాగిరెడ్డికుంట వరకు, గట్టమ్మ ఆలయం నుంచి పానేస కాల్వ వరకు పనులు నిలిచిపోయాయి. ఈ భూమి మాదంటే మాది అంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది.

వేరే దగ్గర భూమి ఇవ్వాలని..

వాస్తవానికి కెనాల్‌ నుంచి ఇరువైపులా ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ సంరక్షించుకుంటూ వస్తోంది. ఎన్‌హెచ్‌ రోడ్డు పక్కన విలువైన టేకు, కొడిశ, నల్లమద్ది, ఏరుమద్ది, బిలుగు, సండ్ర, గుల్‌మోహర్‌, సిస్సు, నెమలినార, నారేప, చిందుగ వంటి చెట్లను ఇతరులు కొట్టకుండా ఈ ప్రదేశం చుట్టూ ట్రెంచ్‌ వేసింది. అయితే ఇప్పుడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 53/2, 53/19 భూమి రెవెన్యూకు సంబంధించిన ఆస్తి అని పంచాయతీని మొదటికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారులు తమతమ దగ్గర ఉన్న ఆధారాలతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా విషయం కొలిక్కి రాలేదు.

జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి మా దేనని, ఒక వేళ విస్తరణకు భూమిని తీసుకుంటే ఇరువైపులా 12.5 మీటర్ల చొప్పున 11.34 ఎకరాల భూమిని మరోచోట అప్పగించాలని అటవీ శాఖ ప్రపోజల్‌ పెట్టింది. అయితే దీనికి రెవెన్యూ శాఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న చెట్లను కొట్టేసే క్రమంలో కాంపన్‌స్ట్రేషనరీ ఎఫారెస్ట్రేషన్‌ కింద రూ.16 లక్షలు చెల్లించాలని పెట్టిన ప్రపోజల్స్‌కు సైతం ససేమీరా ఒప్పుకోకపోవడంతో అప్పటి డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌ పలుమార్లు పనులకు అడ్డుతగిలినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో డీఎఫ్‌ఓపై ఫిర్యాదులు అందాయని, ఆయన బదిలీకి ఇది ఒక కారణమని తెలుస్తుంది.

గతంలోనూ అంతే..

సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ పనుల్లో భాగంగా స్థల సేకరణ సమయంలో రెవెన్యూ–అటవీ అధికారులకు భూమి హద్దుల విషయంలో ఇదే విధంగా జరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడం అటవీ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. దీంతో అటవీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌, అధికారులపై ఎఫ్‌సీ–1980 చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది.

ఎన్‌హెచ్‌ అధికారులకు నోటీసులు

ఎన్‌హెచ్‌ విస్తరణ విషయం లోలోపల చిలికిచిలికి గాలివానగా మారుతుందని ఇరుశాఖల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో ఇటు పీసీసీఎఫ్‌, అటు సీఎస్‌కు ఫైల్స్‌ అందాయని సమాచారం. దీంతో స్పందించిన పీసీసీఎఫ్‌ నేషనల్‌ హైవే వరంగల్‌ డివిజన్‌ అధికారులకు ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌(ఎఫ్‌సీ)–1980 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నేషనల్‌ హైవే ఇరువైపులా చెట్లకు సంబంధించిన సర్వే చేపట్టకూడదని సిరికల్చర్‌, హార్టికల్చర్‌ అధికారులకు ఎఫ్‌సీ యాక్ట్‌ ప్రకారం నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు చెట్లకు నంబరింగ్‌ ఇస్తున్నట్లుగా అటవీ అధికారవర్గాలు చెబుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అటవీ అధికారులు పట్టుపట్టి కూర్చున్నారు. ఈ విషయంలో ఇరుశాఖల రాష్ట్రస్థాయి అధికారులు రాజీకి వస్తే తప్పా కెనాల్‌ నుంచి నాగిరెడ్డి కుంట వరకు, డీబీఎం–38 కెనాల్‌(పానేసా కాల్వ) నుంచి గట్టమ్మ మధ్యలో విస్తరణ పనులు జరిగేలా కనిపించడం లేదు.

Advertisement
Advertisement