Raj Kundra- Shilpa Shetty: శిల్పాశెట్టికి హైకోర్టులో ఎదురుదెబ్బ

You Choose Public Life: Bombay High Court On Shilpa Shetty Defamation Plea - Sakshi

Bombay High Court On Shilpa Shetty Defamation Plea: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టికి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా కేసుకు సంబంధించి వార్తా ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో రాజ్‌కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో శిల్ప- రాజ్‌కుంద్రా దంపతుల వ్యవహారం గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి.

 

ఈ క్రమంలో... తమ పరువుకు భంగం కలిగించే విధంగా మీడియా వ్యవహరిస్తోందని శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పలు మీడియా సంస్థలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ గురించి ప్రచురితమవుతున్న కథనాలను అడ్డుకోవాలని కోరుతూ... పరువు నష్టం దావా వేసింది. శిల్పా పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి తరఫున హాజరైన న్యాయవాది బీరేన్‌ సరాఫ్‌ మాట్లాడుతూ.. ‘‘భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా మీడియాలో రాయడం సరికాదు(కుంద్రాతో కలిసి పోలీసులు ఇంటికి వచ్చినపుడు శిల్పా భావోద్వేగానికి గురికావడం, వారి మధ్య జరిగిన గొడవను ఉద్దేశించి)’’ అని వాదించారు. 

ఇందుకు స్పందించిన జస్టిస్‌ గౌతం పటేల్‌ ... ‘‘పోలీసులు చెప్పిన వివరాల గురించి ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు. ఇలా ప్రతి అంశాన్ని అడ్డుకోవాలంటే అది పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శిల్పాశెట్టి భావోద్వేగానికి లోనుకావడం వంటి విషయాలు ఇతరుల(పోలీసులు) ముందే జరిగాయి. క్రైం బ్రాంచ్‌ వర్గాలు చెప్పిన వివరాల ఆధారంగా మీడియా రిపోర్టులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు.

అదే విధంగా... ‘‘మీరు(శిల్పాశెట్టిని ఉద్దేశించి) పబ్లిక్‌ లైఫ్‌ను ఎంచుకున్నారు. సెలబ్రిటీగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాన్ని మైక్రోస్కోప్‌ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. ‘‘ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో.. మీరు ఏడ్చారు. మీ భర్తతో వాదులాడారు’’ అన్న అంశాలు పరువు నష్టం కిందకు రావు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే స్ఫురిస్తాయి’’ అని జస్టిస్‌ గౌతం పటేల్‌ అన్నారు. మీడియా స్వేచ్చను అడ్డుకునేలా తాము వ్యవహరించలేమని స్పష్టం చేశారు. అయితే పిల్లల పెంపకం విషయంలో శిల్పాశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారన్న అంశాన్ని ప్రచురించే సమయంలో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తూ.. సంమయనం పాటించాల్సిందని మీడియాకు హితవు పలికారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top