పెళ్లెప్పుడు... అని అడిగేవారు: సాయి పల్లవి | Sakshi
Sakshi News home page

Love Story: పెళ్లెప్పుడు... అని అడిగేవారు: సాయి పల్లవి

Published Thu, Sep 23 2021 12:01 AM

We Can See Sekhars Honesty In Love Story: Sai Pallavi - Sakshi

‘‘సమాజంలో మహిళలపై జరిగే దాడులు విని, చదివి బాధపడతాను. మనం ఏం చేయలేమా? అనుకుంటాను. ‘లవ్‌ స్టోరీ’లో మౌనిక పాత్ర చేస్తున్నప్పుడు కనీసం నా సినిమా ద్వారా అయినా నా వాయిస్‌ చెప్పగలిగాను అనే సంతృప్తి కలిగింది’’ అని సాయిపల్లవి అన్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి చెప్పిన విశేషాలు. 

డ్యాన్స్‌ చేయాలంటేనే నాకు భయం వేస్తుంటుంది. ‘రౌడీ బేబీ..’ పాట కష్టంగా అనిపించింది. ‘ఎమ్‌సీఏ’ చిత్రంలో ‘ఏవండోయ్‌ నానిగారు..’ పాటకు బాగా కష్టపడ్డా. వెనక్కి వంగి డ్యాన్స్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. వెన్నెముక దెబ్బతిందేమో? అనుకునేదాన్ని.  

శేఖర్‌ కమ్ములగారి నుంచి ‘లవ్‌స్టోరీ’కి పిలుపు వచ్చినప్పుడు కచ్చితంగా చేయాలని ఫిక్స్‌ అయ్యాను. కథలో మౌనిక పాత్ర విన్న తర్వాత నటించాలనే కోరిక ఇంకా గట్టిగా కలిగింది. మౌనిక తన డ్రీమ్స్‌ను ఫాలో అవుతుంది. నేను ఎందులో తక్కువ? అనే ఆత్మవిశ్వాసం మౌనిక పాత్రలో కనిపిస్తుంది.
మన కుటుంబంలో, సమాజంలో లింగ వివక్షను చూస్తుంటాం. ఈ సమస్యలను టచ్‌ చేస్తూ ఆలోచింపజేసేలా ‘లవ్‌స్టోరీ’ని తీశారు శేఖర్‌ కమ్ముల. మా సినిమా చూశాక ప్రేక్షకుల్లో కచ్చితంగా ఒక ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది.


మనలో ఎవరూ పర్ఫెక్ట్‌ కాదు, మాస్టర్స్‌ కాదు.. కానీ సాధించాలనే విల్‌ పవర్‌ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నాగచైతన్య, నా క్యారెక్టర్‌ ద్వారా చెప్పించారు. నాగచైతన్యతో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌గా అనిపించింది.
చిరంజీవి సార్‌కు పెద్ద మనసుంది.. అందుకే నువ్వు డ్యాన్స్‌ బాగా చేస్తావని కితాబిచ్చారు. నాతో డ్యాన్స్‌ చేయాలని ఉందని సరదాగా అన్నారు. నా డ్యాన్స్‌ చూసి ప్రేక్షకులు సంతోషపడితే అదే చాలు. నాకంటే బాగా డ్యాన్స్‌ చేసేవాళ్లు ఉంటారు. చాన్స్‌ వస్తే వాళ్లూ నిరూపించుకుంటారు. 


‘ఫిదా, లవ్‌స్టోరీ’ సినిమా షూటింగ్స్‌ దాదాపు పల్లెటూరిలోనే జరిగాయి. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు మరచిపోలేను. ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌.. అమ్మానాన్న ఏం చేస్తారు?’ ఇలాంటి వ్యక్తిగత విషయాలు అడిగేవారు. ‘లవ్‌స్టోరీ’ షూటింగ్‌ పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తుంటే వారు పండించిన పసుపును బహుమానంగా ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement