భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్‌ హీరో | Waheeda Rehman And Guru Dutt Love Story | Sakshi
Sakshi News home page

భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్‌ హీరో.. ఆయన మరణం కూడా మిస్టరీనే

Feb 14 2024 3:12 PM | Updated on Feb 26 2024 5:53 PM

Waheeda Rehman And Guru Dutt Love Story - Sakshi

గురుదత్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమాపై ఏ టాక్ పూర్తి కాదు . హిందీ చలనచిత్ర చరిత్రలో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా త్రిపాత్రాభినయంతో మెప్పించాడు. ఇండియన్‌ సినిమాపై చెరగని ముద్రవేసి చిరు ప్రాయంలోనే (39 ఏళ్లు) నిజ జీవిత చిత్రం నుంచి తెరమరుగైన గురు దత్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకునే వారు ఉంటారంటే ఏం ఆశ్చర్యం కలుగదు. 1957లో విడుదలైన గురుదత్‌ మాస్టర్‌ పీస్‌ ‘ప్యాసా’. ఇప్పటి వారికి ఆ సినిమా పెద్దగా పరిచయం ఉండదు కానీ అప్పట్లో అదొక సంచలనం. హీందీ ఆల్-టైమ్ 100 ఉత్తమ చలనచిత్రాల జాబితాలో ప్యాసా ఉండటంలో ఆశ్చర్యం లేదు.ఆయన జీవితంలో  పెళ్లి, ప్రేమ రెండూ ప్రత్యేకమే..


(గురుదత్‌- వహీదా రెహమాన్‌)

వహీదా కోసం హీరోగా మారిన గురుదత్‌
‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ నటి వహీదా రెహమాన్‌. 1955లో ‘రోజులు మారాయి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె దర్శకుడు గురుదత్‌ దృష్టిలో పడింది. ఆమె అందానికి, నటనకి ఫిదా అయిన గురుదత్‌ ‘సీఐడీ’ అనే సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశాడు. అలా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది వహిదా. 1956లో విడుదలైన ఆ చిత్రం..అప్పటికి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఇండియన్‌ సినిమాగా చరిత్రకెక్కింది.

వహిదా అందానికి ముగ్ధుడైన డైరెక్టర్‌ గురుదత్‌ ఆమె కోసం హీరోగా అవతారమెత్తాడు. వహిదా కోసం ‘ప్యాసా’ చిత్రంలో కూడా హీరోగా నటించాడు. వాస్తవానికి తొలుత ఆ సినిమాకు హీరో దిలీప్‌ కుమార్‌. అయితే వహిదా రెహమాన్‌ హీరోయిన్‌గా చేస్తుందని తెలియడంతో దిలీప్‌ని తప్పించి తనే హీరోగా నటించాడు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వహిదాకి గురుదత్‌ క్లోజ్‌ అయ్యాడు. తొలుత ఇద్దరి మంచి స్నేహితులుగా కొనసాగారు. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. 

ట్విస్ట్‌ ఇచ్చిన గురుదత్‌
వహీదా రెహమాన్‌కు తొలి బాలీవుడ్‌ సినిమా ఇచ్చిన గురుదత్‌.. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. వహిదా కూడా అతన్ని ఇష్టపడింది. అయితే అప్పటికే గురుదత్‌కు పెళ్లి అయింది. 1953లో ప్రముఖ గాయని గీతాదత్‌ని గురుదత్‌ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వహిదాకు తెలియదు. గురుదత్‌ కూడా దాచి పెట్టాడు. కానీ ‘ప్యాసా’ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకనొక దశతో గురుదత్‌ భార్యకు విడాకులు ఇచ్చి వహిదాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. 


(సతీమణి గీతాదత్‌తో గురుదత్‌)

భార్య కోసం ప్రేమ త్యాగం
గురుదత్‌- వహిదా రెహమాన్‌ల ప్రేమ వ్యవహారం గీతాదత్‌కు కూడా తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. కొన్నాళ్ల తర్వాత పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేరుగా జీవించడం ప్రారంభించింది. ఫ్యామిలీ అంతా దూరం అవ్వడాన్ని గురుదత్‌ తట్టుకోలేకపోయాడు. భార్య, పిల్లలు తిరిగి తన వద్దకు రావాలంటే.. ప్రేమను త్యాగం చేయాల్సిందే అనుకున్నాడు. అందుకే వహిదాను దూరం పెట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు గీతా దత్‌ తిరిగి ఇంటికొచ్చింది. గురుదత్‌ చాలా రోజుల వరకు వహిదాను మర్చిపోలేదట. ఆమె తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని అతని సన్నిహితులు చెప్పేవారు. 

కుంగిపోయిన వహీదా
ప్రేమ విఫలం కావడంతో వహిదా కుంగిపోయింది. గురుదత్‌ని మర్చిపోవడానికి వరుస సినిమాలను ఒప్పుకుంది. నటిగా బీజీ అయింది. దేవ్‌ ఆనంద్‌తో ఎక్కువ సినిమా చేయడంతో అతనితో ప్రేమలో పడిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అదంతా ఒట్టి పుకారు మాత్రమే. గురుదత్‌ తర్వాత ఆమె ఎవరినీ ప్రేమించలేదు. 1974లో బాలీవుడ్‌ నటుడు శషిరేఖీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సోహైల్‌ రేఖీ, కాశ్వీ రేఖీ ఉన్నారు. 2000 సంవత్సరంలో శషిరేఖీ చనిపోయాడు. ప్రస్తుతం వహిదా ముంబైలో పిల్లలతో కలిసి ఉంటోంది.

మిస్టరీగా గురుదత్‌ మరణం
వహిదా రెహమాన్‌ దూరం కావడంతో గురుదత్‌ కాపురంలో కూడా చిచ్చు రేగింది రేపింది. గురుదత్ మరణించినప్పుడు, భార్యతో కాక, ఒంటరిగానే ఉన్నాడు. అక్టోబరు 10, 1964 రోజు గురుదత్ తన మంచంలో చనిపోయి కనిపించాడు. మద్యం ఎక్కువైందో లేక నిద్రమాత్రలు అతిగా మింగాడో ఎవరికీ తెలియదు. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.  ‘ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ గురుదత్‌’ పేరిట 1989లో డాక్యుమెంటరీ వచ్చింది. ఆయన బయోపిక్‌ నిర్మాణం కోసం బాలీవుడ్‌ డైరెక్టర్‌ భావనా తల్వార్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్తుందని గతంలో ప్రకటించారు.

- పోడూరి నాగ ఆంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement