
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupathi)పై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్మీడియలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా స్పందించారు. తను నటించిన కొత్త సినిమా 'సార్ మేడమ్' విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన క్యాస్టింగ్‌కౌచ్(CASTING COUCH) ఆరోపణల గురించి ఆయన్ను ప్రశ్నించగా రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపారు. ఆమెపై సైబర్‌క్రైమ్‌లో తన టీమ్ పిర్యాదు చేసిందని చెప్పారు.
తనపై వచ్చిన క్యాస్టింగ్‌కౌచ్ ఆరోపణల గురించి విజయ్ ఇలా అన్నాడు.. 'చిత్రపరిశ్రమలోనే కాదు దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవు. కానీ, ఆ మహిళ చేసిన ఆరోపణలతో నా కుటుంబం, సన్నిహితులు చాలా కలత చెందారు. ఇలాంటి మాటలు ఇక్కడ సహజం. వాటిని వదిలేయమని నా కుటుంబాన్ని కోరాను. సోషల్మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థం అవుతుంది. ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతుంది. ఆపై పేరు వస్తుంది. ఆమె దానిని ఆస్వాదించనివ్వండి.' అంటూ విజయ్ చెప్పారు.
తనపై ఆరోపణలు చేసిన మహిళపై తన టీమ్ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిందన్నారు. తాను ఏడు సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎన్నో ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు అలాంటివి తన లక్ష్యం మీద ప్రభావితం చేయలేదన్నారు. అది ఎప్పటికీ జరగదని బలంగా చెప్పారు.

విజయ్పై వచ్చిన ఆరోపణ ఇదే
కోలీవుడ్‌లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి (జులై 28) మధ్యాహ్నం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఇలా ఆరోపించింది. ‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్‌లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు.
ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. విజయ్‌ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. మళ్లీ మరో పోస్ట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్‌ను తొలగించినట్లు ఆ ట్వీట్‌లో పేర్కొంది.