50 రోజుల్లో అమెజాన్‌లో 'వకీల్‌ సాబ్‌'!

Vakeel Saab: Amazon Prime Gets Pawan Movie Digital Rights - Sakshi

వీడు ఆరడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు.. అని 'అత్తారింటికి దారేది'లో గేయ రచయిత శ్రీమణి చెప్పినట్లుగానే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బాక్సాఫీస్‌ భయాలను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆ మధ్య 'అజ్ఞాతవాసి'తో నిరాశపర్చిన ఈ హీరో ఏకకాలంలో మూడు సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో చేస్తున్న వకీల్‌ సాబ్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్‌, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు ఓటీటీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భారీ రేటుకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. అయితే థియేటర్లలో 50 రోజులు ఆడిన తర్వాతే ఓటీటీలో ప్రసారం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే మే నెలాఖరులో వకీల్‌ సాబ్‌ అమెజాన్‌లో ప్రత్యక్షం కానుందన్నమాట. ఇక ఇదివరకే దీని శాటిలైట్‌ హక్కులను జీ తెలుగు కొనేసిన విషయం తెలిసిందే.

కాగా గత సినిమా ఫ్లాపుల ప్రబావం పవన్‌ కల్యాణ్‌ మీద ఇసుమంతైనా లేకపోగా అతడు తన రెమ్యూనరేషన్‌ను పెంచేయడం గమనార్హం. మరోవైపు గతంలో తీసుకున్నదాని కంటే 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇచ్చేందుకు నిర్మాతలు సైతం సిద్ధమవుతుండటం విశేషం. ఈ క్రమంలో వకీల్‌ సాబ్‌కు పవన్‌ సుమారు రూ.50-55 కోట్లు ఎక్కువగా తీసుకున్నట్లు వినికిడి. అంటే ఆయన ఇంచుమించు రూ.300- 400 కోట్ల పారితోషికం అందుకున్నట్లు లెక్క. ఇదిలా వుంటే పవన్‌ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్‌ కోషియమ్'‌ రీమేక్‌తో పాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ఒకటి, సాగర్‌ చంద్ర దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు‌.

చదవండి: పవన్‌‌ రీ ఎంట్రీ ఖరీదు రూ. 300 కోట్లా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top