డబుల్‌ ట్రీట్‌ | Upcoming Movies in Tollywood: South Stars Upcoming Films In Dual Roles | Sakshi
Sakshi News home page

డబుల్‌ ట్రీట్‌

Apr 1 2026 2:40 AM | Updated on Apr 1 2026 2:40 AM

Upcoming Movies in Tollywood: South Stars Upcoming Films In Dual Roles

ద్విపాత్రాభినయం చేస్తున్న తెలుగు హీరోలు

అభిమాన హీరోలు స్క్రీన్‌పై ఒక గెటప్‌లో కనిపిస్తేనే వారి ఫ్యాన్స్‌ కేరింతలతో థియేటర్స్‌ మారు మోగిపోతాయి. అలాంటిది ఒకే టికెట్‌పై ఒక బొమ్మలో తమ అభిమాన హీరోను రెండు గెటప్స్, రెండు క్యారెక్టరైజేషన్స్‌తో చూసినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఇలా ప్రేక్షకులను అలరించేందుకు కొందరు తెలుగు హీరోలు ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాలు చేస్తున్నారు. వెండితెరపై డబుల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్న హీరోలపై ఓ లుక్‌ వేయండి..  

మరోసారి డబుల్‌ ధమాకా 
‘విక్రమార్కుడు, దరువు, పవర్‌’ వంటి చిత్రాల్లో రవితేజ ద్విపాత్రాభినయం చేసి ఆడియన్స్‌ని మెప్పించారు. కొంత గ్యాప్‌ తర్వాత రవితేజ మళ్లీ ‘ఇరుముడి’ సినిమాలో డబుల్‌ రోల్‌లో కనిపించనున్నట్లుగా తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ థ్రిల్లర్‌ సినిమాలో ఒక పాత్రలో తండ్రిగా, మరో పాత్రలో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న వ్యక్తిగా రవితేజ కనిపిస్తారట. ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీశంకర్, కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. అజయ్‌ ఘోష్, రమేష్‌ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించనున్నారు.

రుద్ర... రాముడు 
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ టైమ్‌ ట్రావెల్‌ అండ్‌ మైథలాజికల్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. అలాగే రాముడి పాత్రలోనూ కనిపించనున్నారు. ‘వారణాసి’ సినిమాలో రుద్ర, రాముడిగా... ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా ఇటీవల మహేశ్‌బాబు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే... సమ్మర్‌ సమయం కనుక వేసవి తాకిడికి కాస్త దూరంగా ఉండాలని మహేశ్‌బాబు అండ్‌ టీమ్‌ భావిస్తున్నారట.

ఇందులో భాగంలో ఈ వేసవి సమయంలో మహేశ్‌బాబు ఓ వెకేషన్‌ను ప్లాన్‌ చేసుకున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. మేలో మళ్లీ షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తారు. జూన్‌లో ‘వారణాసి’ సినిమా యూనిట్‌ అంటార్కిటికా లొకేషన్స్‌లో చిత్రీకరకణను ప్లాన్‌ చేసినట్లుగా తెలిసింది. ఈ ప్రదేశంలో చిత్రీకరణ జరుపుకోబోయే తొలి తెలుగు చిత్రంగా ‘వారణాసి’ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రాతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ఓ పాట చిత్రీ కరణ కూడా ఉంటుందట. అలాగే రాముడి పాత్రలో మహేశ్‌బాబు కనిపించే సీక్వెన్స్‌ దాదాపు అరగంట పాటు ఉంటుందని తెలిసింది.

ఇంకా ‘వారణాసి’ సినిమాను తొలుత రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక భాగంగానే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేసినట్లుగా రాజమౌళి ఇటీవల ఓ సందర్భంగా చెప్పా రు. కానీ ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘ధురంధర్‌’ రెండు భాగాలుగా విడుదలై, బంపర్‌ బ్లాక్‌బస్టర్‌హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా  ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్‌ తెరపైకి వచ్చింది. పైగా ‘బాహుబలి’ సినిమాను రెండు భాగాలుగా తీసిన అనుభవం రాజమౌళికి ఉంది. మరి... ‘వారణాసి’ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మహేశ్‌బాబు చైల్డ్‌ ఆర్టిస్టుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించగా, విజయశాంతి హీరోయిన్‌గా నటించారు.

డ్రాగన్‌లో డ్యూయల్‌ రోల్‌? 
ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమా చిత్రీకరణ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్‌ కాస్త బొద్దుగా కనిపించారు. కొంత షూటింగ్‌ పూర్తయిన తర్వాత లీన్‌ లుక్‌లోకి వచ్చేశారు. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఏమైనా ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అనిల్‌ కపూర్, కాజోల్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని భోగట్టా. నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రీకొడుకు దేవ, వర పాత్రల్లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదలైంది. మలి భాగం చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ‘దేవర’ సినిమాను నిర్మిస్తున్నారు.

పెద్ది ఆట 
రామ్‌ చరణ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ఈ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ మల్టీస్పోర్ట్స్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ ప్రకారం రామ్‌ చరణ్‌ క్రికెటర్‌గా, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించారు. ఇటీవల ‘పెద్ది పహిల్వాన్‌’ అంటూ ‘పెద్ది’ సినిమా నుంచి ఓ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో క్రికెటర్‌గా ఉన్న రామ్‌చరణ్, కుస్తీ చాలెంజ్‌ను స్వీకరించినట్లుగా కనిపిస్తోంది.

కానీ క్రికెటర్‌ నుంచి రామ్‌ చరణ్‌ కుస్తీ వైపు అడుగులు వేయడానికి బలమైన కారణం ఉందని, తన తండ్రి కోసమే రామ్‌ చరణ్‌ అలా మారతారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. అయితే ఈ తండ్రి పాత్రలోనూ రామ్‌ చరణే కనిపిస్తారట. అలా తండ్రీకొడుకులుగా ‘పెద్ది’ సినిమాలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్‌. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకాలపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 30న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

కాకపోతే... ఈ సినిమా రిలీజ్‌ డేట్‌లో మార్పు ఉండొచ్చని, ‘పెద్ది’ సినిమా ఈ వేసవిలో రిలీజ్‌ కావడం లేదని, జూన్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉండటం, పోస్ట్‌ ప్రోడక్షన్స్‌ వర్క్స్‌ విషయంలో టీమ్‌ హడావిడి చేయకుండా క్వాలిటీ కోసం టైమ్‌ కేటాయించాల్సి రావడం, ఇటీవల రామ్‌ చరణ్‌ కంటికి చిన్న గాయం కావడం వంటి అంశాలు ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ వాయిదా పడటానికి కారణమై ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బ్రదర్స్‌గా... 
కెరీర్‌లో ఇప్పటి వరకు 21 సినిమాలను పూర్తి చేశారు అల్లు అర్జున్‌. కానీ వెండితెరపై అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయం చేయలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని తెలిసింది. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ తొలిసారి బ్రదర్స్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ఇటీవలి కాలంలో రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో అల్లు అర్జున్‌ కనిపించారు.

దీంతో అల్లు అర్జున్‌లోని ఈ డిఫరెంట్‌ మేకోవర్‌ అట్లీ సినిమా కోసమే అనే ప్రచారానికి బలం చేకూరి నట్లయింది. ఈ నెల ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాకూర్, భాగ్యశ్రీ భోర్సే... వంటి హీరోయిన్స్‌ కూడా భాగం కానున్నారని, త్వరలోనే ఈ అంశాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

అయితే తన వంతు షూటింగ్‌ను మాత్రం అల్లు అర్జున్‌ త్వరితగతిన పూర్తి చేసి, లోకేశ్‌ కనగరాజ్‌తో చేయాల్సిన సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. అట్లీతో అల్లు అర్జున్‌ చేస్తున్న చిత్రానికి భారీ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ చేయాల్సి ఉంది. దీంతో పోస్ట్‌ ప్రోడక్షన్స్‌ కోసం ఈ మూవీ టీమ్‌ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. అందుకే ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్‌ చేయడం సాధ్యపడదట.

తొలిసారిగా..! 
ఈ మధ్య ‘ఎక్స్‌ట్రా, రాబిన్‌హుడ్‌’ వంటి మాస్‌ కమర్షియల్‌ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ‘తమ్ముడు’ వంటి యాక్షన్‌ డ్రామా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు నితిన్‌. తాజాగా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ సైన్‌ చేశారని సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా, ఒక్క క్షణం, ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు నితిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీలో నితిన్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. 30 సినిమాలకుపైగా చేసిన నితిన్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్న చిత్రం ఇది.  

కామ్రేడ్‌ కల్యాణ్‌ 
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’. 1992 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమా ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ ప్రోమోను బట్టి ఈ చిత్రంలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కామ్రేడ్‌ కల్యాణ్‌గా, గ్రామంలోని ఓ చురుకైన వ్యక్తిగా శ్రీ విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నాగబంధం 
విరాట్‌ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాలో డిఫరెంట్‌ గెటప్స్‌లో విరాట్‌ కర్ణ కనిపించనున్నట్లుగా ఇటీవల ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ వచ్చింది. ఇందులో లార్డ్‌ శివగా, ఓ మాములు మోడ్రన్‌ అబ్బాయిగా విరాట్‌ కర్ణ కనిపిస్తున్నారు. సో... ‘నాగబంధం’లో విరాట్‌కర్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఊహించవచ్చు మరి... ఈ సినిమాలో విరాట్‌ కర్ణ రోల్‌ ఎలా ఉండబోతుంది అనేది జూన్‌ 3న తెలిసిపోతుంది. ఎందుకంటే.. ఈ సినిమాను ఆ రోజే రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.

శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న నాగబంధం అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ ‘నాగబంధం’ సినిమా కథనం సాగుతుంది. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్‌ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఈ సినిమా స్టోరీ సాగుతుంది’’ అని మేకర్స్‌ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రిషబ్‌ సాహ్ని, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్‌ మంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్‌ అవినాష్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్‌ నామా దర్శకత్వంలో కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇలా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ తరహా కథలను చేసేందుకు చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement