ఆ తర్వాతే కొత్త సినిమాలు.. ఫిలించాంబ‌ర్ కీలక నిర్ణయం

Tollywood To Complete Unfinished Film Shootings First Telugu Film Chamber New Rule - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్స్‌ ఆరంభమవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తే బాగుంటుందనే విషయంపై చర్చించేందుకు ‘తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఓ సమావేశం నిర్వహించాయి. ఆ సమావేశంలో తీర్మానించిన అంశాలను ‘తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, గౌరవ కార్యదర్శులు కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్, ఎం.రమేష్‌ ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆ నిబంధనలు ఈ విధంగా....

కోవిడ్‌కి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. గతంలో షూటింగ్‌ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకే నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ప్రాముఖ్యత ఇచ్చి పూర్తి చేయాలి. ఆ తర్వాతే కొత్త సినిమాలు చేయాలి. దర్శకులు కూడా షెడ్యూల్స్‌ని కుదించుకుని తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలి.

సినిమా నిర్మించే ప్రొడక్షన్‌ హౌస్‌ ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణుల నుండి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా డిక్లరేషన్‌ తీసుకోవాలి. షూటింగ్స్‌కు హాజరైన ప్రతి యూనియన్‌ సభ్యుడు మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ కచ్చితంగా తీసుకొని ఉండాలి. ఫెడరేషన్‌లోని 24 విభాగాల సభ్యులందరికీ జీవిత భీమా చేయించాలి. ఆ బాధ్యతను ఫెడరేషన్, ఆయా యూనియన్‌ వారు తీసుకోవాలి.

పై తీర్మానాలకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ వారు తమ సమ్మతిని తెలియజేశారు. ఈ విషయాలపై ఏవైనా సలహాలు, ఫిర్యాదులు ఉన్నా, నిబంధనలు పాటించకున్నా తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top