తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతల సమస్యల పరిష్కారంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి తమ ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపారు.
కలిసి పనిచేద్దాం..
ఈ సందర్భంగా నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి రవి యలమంచిలి మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. పరిశ్రమలో నిర్మాతలంతా ఐక్యంగా ఉండి మంచి సినిమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ ఇప్పటివరకు సుమారు 180 సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసినట్లు తెలిపారు. నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
నిర్మాత అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. నిర్మాతల మండలి ఎన్నికలు సాధారణంగా రెండేళ్లకు ఒకసారి జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈసారి ఏడు నెలలు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. మండలిలో అధ్యక్షుడి మాట కూడా చెల్లని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం తాను నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు.


