హీరో భార్యకి నచ్చలేదని నన్ను తప్పించారు

Taapsee Replaced In A Film Because The Hero Wife Did not Want Her In It - Sakshi

హిందీ సినిమా ‘పింక్‌’ తర్వాత దాదాపు శక్తిమంతమైన పాత్రలే చేస్తున్నారు తాప్సీ. తెర మీద అన్యాయాలను ఎదిరించే ధైర్యం ఉన్న అమ్మాయి పాత్రలు చేస్తున్న ఆమె తెరవెనక కూడా తన మనసులోని మాటలను ధైర్యంగా చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో చెప్పారామె. తాజాగా కొన్ని విషయాలను బయటపెట్టారు. అయితే తాను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ల పేర్లను బయటపెట్టకుండా ‘ఆ హీరో’ అని సంబోధించారు.

తాప్సీ మాట్లాడుతూ – ‘‘గతంలో ఓ హీరో భార్యకు నేను ఆ సినిమాలో నటించడం ఇష్టం లేకపోవడంతో నన్ను తప్పించి, వేరే హీరోయిన్‌ని తీసుకున్నారు. ఇంకో సినిమాకైతే హీరోకి నా డైలాగ్‌ నచ్చలేదు. దాంతో మార్చమన్నాడు. కానీ నేను తిరస్కరించాను. ఆ సినిమాకి నేను డబ్బింగ్‌ చెప్పుకున్నాను. కానీ నేను డైలాగ్‌ మార్చడానికి తిరస్కరించడం వల్ల డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో చెప్పించారు. అలాగే ఒక హీరో సరసన సినిమా కమిట్‌ అయ్యాక, ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమా బాగా ఆడలేదని బడ్జెట్‌ కంట్రోల్‌ చేయాలని నా పారితోషికం తగ్గించుకోమన్నారు.

ఇంకో హీరో అయితే నా ఇంట్రడక్షన్‌ సీన్‌ని మార్చాలని కోరాడు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్‌ సీన్‌ని డామినేట్‌ చేసే విధంగా ఉందని ఆ హీరోకి అనిపించిందట. ఇవన్నీ కూడా నా ముందు జరిగిన విషయాలు. ఇక వెనక ఎలాంటివి జరిగి ఉంటాయో’’ అన్నారు తాప్సీ. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడా తగ్గడంలేదని తాప్సీ చెబుతూ – ‘‘కొన్నాళ్లుగా నాకు పూర్తి సంతృప్తినిచ్చే సినిమాలనే ఒప్పుకుంటున్నాను. అయితే కొందరు నా నిర్ణయం సరికాదన్నారు. ఇక ఎవరైనా హీరోయిన్‌ లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేస్తే చాలు... ఆమెను హీరోలు తమ సినిమాల్లో కథానాయికగా తీసుకోవడానికి వెనకాడతారు.

ఏది ఏమైనా నాకు తృప్తినిచ్చే సినిమాలే చేయాలంటే ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు చేయడంవల్ల ప్రతిరోజూ నేను ఆనందంగా ఉంటాను’’ అన్నారు. హిందీలో నామ్‌ షబానా, బద్లా, సాండ్‌ కీ ఆంఖ్, థప్పడ్‌.. ఇలా వరుసగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నారు తాప్సీ. ప్రస్తుతం హిందీలో చేస్తున్న ‘హసీన దిల్‌ రుబా’, ‘రష్మీ రాకెట్‌’ చిత్రాలు కూడా ఆ కోవకి చెందినవే. ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top