Suvarna Sundari Review: ‘సువర్ణ సుందరి’మూవీ రివ్యూ

Suvarna Sundari Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: సువర్ణ సుందరి
నటీనటులు:  జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు 
నిర్మాణ సంస్థ:  ఎస్ టీమ్ పిక్చర్స్
నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ 
రచన,దర్శకత్వం: సురేంద్ర మాదారపు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: యెల్లుమహంతి ఈశ్వర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023

కథేంటంటే..
ఈ సినిమా కథంతా.. సువర్ణ సుందరి అనే విగ్రహం చుట్టూ తిరుగుతుంది.  300 ఏళ్ల  క్రితం కర్ణాటకలోని కాలక్కల్‌ సంస్థానంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహాలను తయారు చేసే ఓ వ్యక్తి ఆ విగ్రహంలో దుష్టశక్తిని నింపుతాడు. దాని కారణంగా ఆ రాజ్యమే నాశనం అవుతుంది. దీంతో గ్రామస్తులంతా సువర్ణ సుందరి విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. అయితే 300 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పొరపాటున ఆ విగ్రహాన్ని బయటకు తీయడంతో అతని ఫ్యామిలీ అంతా చనిపోతుంది.

స్వాతంత్రానంతరం ఆ విగ్రహం ఓ పాత బంగ్లా చేరుతుంది. ఆ బంగ్లాలోకి దిగిన కలెక్టర్‌ భార్య అంజలి(పూర్ణ)కి ఆ విగ్రహం దొరుకుతుంది. ఆమె సువర్ణ సుందరిని టచ్‌ చేయగానే దుష్టశక్తి ఆమెలో చేరిపోతుంది. దీంతో తన భర్తను, మామను అంజలి చంపేస్తుంది. తన కూతురు విశాలాక్షి (జయ ప్రద)ను కాపాడుకునేందుకు అంజలి ఆ విగ్రహంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ మళ్లీ అంజలి కొన్నేళ్ల తరువాత జన్మిస్తుంది. 

అలా మళ్లీ అంజలి చేతికే ఆ విగ్రహం దొరుకుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తన తల్లిని కాపాడుకునేందుకు విశాలాక్షి చేసే ప్రయత్నం ఏంటి?  సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి?  ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? విగ్రహం వెనుకున్న రహస్యం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
 పురాతన బంగ్లా, సంస్థానం.. అందులో దుష్టశక్తి ఉండడం..దాని వల్ల ప్రజలకు హానీ కలగడం..ఈ తరహా కథలను మనం చూశాం. కానీ సువర్ణ సుందరి కథలో కొత్తదనం ఏంటంటే విగ్రహంలోనే దుష్టశక్తి ఉండడం. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లు రాక్షసుల్లా మారిపోవడం.. చుట్టుపక్కల వాళ్లను చంపి ఆ రక్తంతో దాహం తీర్చుకోవడం..ఇది వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా.. దర్శకుడు సురేంద్ర అంతే ఆసక్తిగా తెరపై చూపించాడు.

కథలో లోపాలు ఉన్నప్పటికీ గ్రాఫిక్స్‌తో వాటిని కప్పిపుచ్చారు. ఫస్టాఫ్‌ అంతా సువర్ణ సుందరీ విగ్రహం చుట్టే సాగుతుంది. కొన్ని సీన్స్‌ భయపెడతాయి. మిగతావి సాదాసీదాగా సాగుతాయి.  కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సువర్ణ సుందరి నేపథ్యం తెలిశాక ప్రేక్షకులు ఆశ్యర్యపోతారు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ గొప్పగా ఉన్నా..మేకింగ్‌ విషయంలో కాస్త తడబడ్డాడు. కథని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్‌ చిత్రాలను ఇష్టపడే వారికి సువర్ణ సుందరి నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ చిత్రంలో అంజలి రెండు గెటప్పుల్లో కనిపిస్తుంది. ప్రజెంట్‌ సీన్లలో మోడ్రన్‌గా కనిపిస్తే.. ప్లాష్‌బ్యాక్‌ సీన్లలో ఎంతో నిండుగా, హుందాగా కనిపిస్తారు.  సాక్షి అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో మెప్పిస్తుంది. జయప్రద మరోసారి తన అనుభాన్ని తెరపై చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన అదిరిపోతుంది. పోలీసు పాత్రలో సాయి కుమార్‌ ఎప్పటిమాదిరే ఒదిగిపోయాడు. చర్చ్ ఫాదర్‌గా కోట శ్రీనివాసరావు, రాజగురువుగా నాగినీడు, మహారాజుగా అవినాష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. యెల్లుమహంతి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top