అజిత్‌కు 'తలా' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Super Star Tthala Ajith 50th Birthday Special - Sakshi

సింప్లిసిటీకి చిరునామా ఆయన. ప్రతిఏటా ఫోర్బ్స్‌ ప్రకటించే అత్యంత సంపన్నుల జాబితాలో మూడుసార్లు నిలిచారు. అయినా సింపుల్‌గా ఆటోలోనూ ప్రయాణిస్తారు. స్టార్‌ హీరో స్టేటస్‌ ఉంది అయినా అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. జుట్టు రంగు నెరిసినా కలర్‌ వేసి కవర్‌ చేయాలనుకోరు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అందుకే తమిళ నాట అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయనే తమిళ సూపర్‌ స్టార్‌ అజిత్‌. తెలంగాణలో పుట్టిన అజిత్‌ బైక్‌ మెకానిక్‌ నుంచి తమిళనాట స్టార్‌గా ఎలా ఎదిగారు? అజిత్‌ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై స్పెషల్‌ స్టోరీ

అజిత్‌ 1971 మే 1న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మమణియన్‌ది కేరళ కాగా, తల్లి మోహిని కోల్‌కతాకు చెందిన వారు. పదవ తరగతిలోనే చదువు మానేసిన అజిత్‌  ఓ మిత్రుడి ద్వారా కొంతకాలం ఓ ప్రముఖ కంపెనీలో అప్రెంటీస్‌ మెకానిక్‌గా పని చేశారు. ఆ తర్వాత వస్త్ర వ్యాపారంలోకి దిగిన అజిత్‌..అక్కడే ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం సంపాదించారు. ఆ తర్వాత మోడలింగ్‌ చేయడం ప్రారంభించారు.

ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ అజిత్‌లోని నటుడ్ని గుర్తించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన అజిత్‌   ‘ఎన్‌ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. అదే సంవత్సరంలో ‘ప్రేమ పుస్తకం’ అనే తెలుగు చిత్రంలో నటించారు. అజిత్‌ నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే. కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించిన అజిత్‌.. ‘అమర్కలం’  చిత్ర షూటింగ్‌లో స్టార్‌ హీరోయిన్‌ షాలినీతో ప్రేమలో పడ్డారు. 2000 ఏప్రిల్‌ 24న పెళ్లిబంధంతో వీరిద్దరూ ఒకటయ్యారు. 

అప్పటి దాకా లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న అజిత్‌ను  మాస్‌ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన చిత్రం ‘ధీన’. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అజిత్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇందులో అజిత్‌ పోషించిన పాత్ర 'తలా'నే అభిమానులు పిలుచుకునే ముద్దుపేరైంది. ‘ఆసాయ్’ అనే సినిమా సక్సెస్‌ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1999లో అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా.. అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.

తన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న  అజిత్‌కు కార్లపై ఉన్న ఇష్టం అంతా ఇంతా కాదు. ఆయన ఇంట్లోనే కార్ల కోసం పెద్ద గ్యారజీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసింగుల్లో అజిత్‌ సత్తా చాటారు. ఇక  తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే అజిత్‌..వీలున్నప్పుడల్లా హైదరాబాద్‌ను విచ్చేస్తుంటారు.  ప్రస్తుతం హెచ్.వినోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వలిమై’ అనే సినిమాలో అజిత్‌ నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top