
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu Movie). పద్మావతి మల్లాది దర్శకత్వంలో తబితా సుకుమార్ సమర్పణలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 24న విడుదలైంది. కాగా శుక్రవారం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డి (‘గాంధీ తాత చెట్టు’) ఎంపికైన విషయం తెలిసిందే.
ఇది నా ఫస్ట్ మూవీ
అమెరికాలో ఉన్న ఆమె ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేసింది. ‘‘ఉత్తమ బాలనటిగా నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి థ్యాంక్స్. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే నా మొదటి సినిమా కాబట్టి. పద్దు, సింధు అక్కలకు, భాను, నేహాల్‌కి... ఇలా ఈ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా స్నేహితులకు, నా సపోర్టర్స్‌కి థ్యాంక్స్. ప్రత్యేకించి మా అమ్మ, నాన్నలకి థ్యాంక్స్’’ అని పేర్కొంది. ఇక ఈ సినిమా కోసం సుకృతి గుండు కొట్టించుకుని మరీ యాక్ట్ చేసింది. జాతీయ అవార్డుతో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది.