
‘‘సాయిగారు ‘జూనియర్’( Junior Movie) మొదలుపెట్టినప్పుడు... మంచి కథతో చిన్న చిత్రం ప్రారంభిస్తున్నారనుకున్నాను. అయితే శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్‌గారు... ఇలా నటీనటుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. దేవిశ్రీ సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్స్... ఇలా ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటే ఓ పెద్ద సినిమాకి ఎలాంటి నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటామో అలా ‘జూనియర్’కి కూడా పెట్టుకుంటూ వెళ్లారు. అలా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా చేశారు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) అన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. డా. రవిచంద్రన్, జెనీలియా ఇతర పాత్రలు పోషించారు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్ రాజమౌళి బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమా అంటే బడ్జెట్ గురించి కాదు... ‘జూనియర్’ సినిమా వెయ్యికి పైగా స్క్రీన్స్‌లలో రిలీజ్ అవుతోందంటే అందుకు ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తే కారణం. ఈ చిత్రాన్ని తొలి రోజే, లేకుంటే తొలి వారమే మేము చూడాలని ఆడియన్స్‌కి ఆసక్తి ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ వద్ద నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వద్దకు వచ్చి ఆ తర్వాత నిర్మాత వద్దకు వచ్చి వెయ్యి స్క్రీన్‌లలో విడుదలవుతోంది.
చిన్ని సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిగారికి అభినందనలు. నేను కూడా ఈ చిత్రం చూసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. తన పాటలతో సినిమాని ఎలివేట్ చేయడం దేవిశ్రీకి బాగా తెలుసు. ‘వైరల్ వయ్యారి...’ పాట ఎంత వైరల్ అయ్యింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చిందనే విషయం గురించి నేను చెప్పక్కర్లేదు.
సెంథిల్ తను అనుకున్న ఔట్‌పుట్ వచ్చేవరకు ఎక్కడ కూడా రాజీపడడు. పీటర్ హెయిన్స్ క్రేజీ మ్యాన్... విపరీతంగా కష్టపడతాడు. కిరీటి చాలా బాగా చేశాడని సెంథిల్, పీటర్ వంటి వారు ప్రశంసించారంటే ఇక ఇండస్ట్రీలో నీకు(కిరీటి) ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఎంతో అంకితభావంతో రాధాకృష్ణ ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా థియేటర్లలో చూడండి. మీ టికెట్ డబ్బులకు కచ్చితంగా పైసా వసూల్ సినిమాలా ఉంటుంది’’ అని చెప్పారు.