బాలు నటించిన సినిమాలు

SP Balasubrahmanyam Movies List - Sakshi

(వెబ్‌స్పెషల్‌): గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణించారు. ఎన్నో ఆపాత మధురాలను గానం చేసిన ఆ మృదుమధుర స్వరం మూగబోయింది. తన అమృత గానంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన గాత్రం ఇక ఎన్నటికి వినపడదు అనే విషయం అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. దేశంలో అత్యధిక భాషల్లో పాటలు పాడి బాల సుబ్రహ్మణ్యం కాదు భారత సుబ్రహ్మణ్యంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కేవలం గాయకుడిగానే కాక డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 1969లో వచ్చిన ‘పెళ్ళంటే నూరేళ్ళ పంట’ అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు బాలు.ఈ నేపథ్యంలో ఆయన నటించిన చిత్రాల్లో కొన్నింటిని ఓ సారి చూడండి..

ఓ పాప లాలీ
1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడిగా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. భార్యను కోల్పోయి.. చేతిలో ఓ బిడ్డతో మిగిలిన తండ్రి పాత్ర పోషించారు బాలు ఈ చిత్రంలో. అనంతరం రాధికతో ప్రేమలో పడటం.. కుమార్తె వారి బంధాన్ని అంగీకరించకపోవడం.. తను పడే సంఘర్షణ చాలా బాగా నటించారు బాలు. ఇక ఈ సినిమాలో మాటే రాని చిన్నదాని పాట ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. (చదవండి: ఒక శకం ముగిసింది!)

ప్రేమ
1989లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్‌, రేవతి ప్రధాన పాత్రధారులు కాగా ఈ చిత్రంలో బాలు సత్యారావుగా కీలక పాత్రలో నటించారు. 

ప్రేమికుడు
ప్రేమికుడు 1994 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం. కాదలన్ దీనికి మూలం. ఇందులో ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రధారులు. ఇక ఈ చిత్రంలో బాలు హీరో తండ్రి పాత్రలో నటించారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో బాలు అందమైన ప్రేమ రాణి పాటలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్‌ కూడా చేశారు.

పవిత్రబంధం
1996లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్‌, సౌందర్య హీరోయిన్‌లు కాగా.. హీరో తండ్రి పాత్రలో బాలు నటించారు. విదేశాల్లో చదివి.. అదే అలవాట్లను స్వదేశంలో పాటించే కొడుకును మార్చడానికి తాపత్రయపడే తండ్రి పాత్రలో జీవించారు బాలు. 

ఆరో ప్రాణం
1997లో విడుదలైన ఈ చిత్రంలో వినీత్, సౌందర్య, బాలసుబ్రమణ్యం ప్రధాన పాత్రలు పోషించారు. తనకంటే ఏడాది పెద్దదయిన యువతిని ప్రేమించిన అబ్బాయి తండ్రిగా కీలక పాత్ర పోషించారు బాలు. (చదవండి: బాలు మామ కన్నీరాగడం లేదు)

రక్షకుడు
1997 వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, సుస్మితా సేన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. దీనిలో బాలు, నాగార్జున తండ్రి పాత్ర పోషించారు. నిరుద్యోగి, కోపిష్టి అయిన కుమారుడి తండ్రి పాత్రలో నటించారు బాలు.

దీర్ఘసుమంగళీ భవ
1998లో వచ్చిన ఈ చిత్రంలో దాసరి, రాజశేఖర్‌, రమ్యకృష్ణ, ప్రేమ, బాలు ప్రధాన పాత్రలు పోషించారు. గ్లామర్‌ ఫీల్డు మీద మోజుతో ఇంటి నుంచి వెళ్లిన యువతి.. చివరికి తప్పు తెలుసుకుని వస్తే ఆదరించరు. ఆ సమయంలో ఆమెకు సాయం చేసే పాత్రలో బాలు కనిపిస్తారు. నిడివి తక్కువే కానీ.. ప్రాధాన్యం ఉన్న పాత్ర.

మిథునం
మిథునం 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. సుప్రసిద్ద తెలుగు రచయిత శ్రీ రమణ దాదాపు పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ చిత్రం. ఉత్తమ విదేశీ భాషా చిత్రంలో ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన చిత్రం. కేవలం రెండే పాత్రలతో సినిమా మొత్తం నడుస్తుంది. అప్పదాసు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) విశ్రాంత ఉపాధ్యాయుడు. అర్ధాంగి బుచ్చి (లక్ష్మి) తో కలిసి స్వగ్రామంలో నివసిస్తుంటాడు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడటం వలన దంపతులిద్దరూ మాత్రమే శేషజీవితాన్ని గడపాల్సి వస్తుంది. అయితే వారు తమ శేషజీవితాన్ని విచారంగా గాక ఎంత రమణీయంగా...రసమయంగా మలుచుకుని ఓ మధురానుభూతిగా మిగిల్చారన్నదే స్థూలంగా కథ. ఇక అప్పరాజు పాత్రలో బాలు జీవించారు. ఆ పాత్రలో ఆయనను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేం.

ఇవే కాక ఇంకా పక్కింటి అమ్మాయి, వివాహ భోజనంబు, మైనా, కళ్లు, చెన్నపట్నం చిన్నోడు, ఊయల, పెళ్లాడి చూపిస్తా, మెరుపు కలలు, గొప్పింటి అల్లుడు, మనసు పడ్డాను కానీ, చిరంజీవులు, ఇంద్ర, మాయా బజార్‌, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు బాలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top