స్నేహకు క్రేజీ ఆఫర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్‌ హీరోకి జోడిగా! | Sakshi
Sakshi News home page

Sneha:స్నేహకు క్రేజీ ఆఫర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్‌ హీరోకి జోడిగా!

Published Wed, Sep 13 2023 7:45 AM

Sneha To Join The Cast Of Vijay And Venkat Prabhu Film - Sakshi

తమిళసినిమా: ఒకపక్క లియోకి సంబంధించిన వార్తలు, మరోవైపు తన కొత్త చిత్రానికి సంబంధించిన వార్తలతో నటుడు విజయ్‌ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ప్రస్తుతం లియో చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటునే ఉంది.

అదేవిధంగా విజయ్‌ నటించిన 68వ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఆయన అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విజయ్‌ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్‌ నటించనున్న యువ పాత్ర గెటప్‌ కోసం ఆయనతోపాటు చిత్ర యూనిట్‌ ఇటీవల అమెరికాలో మకాం పెట్టినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ గెటప్‌ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ లుక్‌ టెస్ట్‌ చేసినట్లు తెలిసింది.

అదేవిధంగా ఇందులో నటుడు ప్రశాంత్‌, ప్రభుదేవా ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాల గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇకపోతే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకలు ఉంటారని అందులో ఓ పాత్రలో నటి స్నేహ నటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దర్శకుడు వెంకట్‌ ప్రభు స్నేహ కలిసి తీసుకున్న ఓ ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో దళపతి కొత్త చిత్రంలో స్నేహ కచ్చితంగా ఉంటుందనే ప్రచారం జోరందుకుంది.  కాగా 20 ఏళ్ల క్రితం విజయ్‌ సరసన స్నేహ వశీకర చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు విజయ్‌తో జత కట్టే అవకాశం వచ్చింది. 

 
Advertisement
 
Advertisement