నా కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.. ప్రకటించిన సీనియర్‌ నటి | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో వారసురాలు.. ప్రకటించిన సీనియర్‌ నటి

Published Tue, Mar 26 2024 1:19 PM

Senior Actress Urvashi Daughter Tejalakshmi Jayan Enter In Movies - Sakshi

అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది.

ఊర్వశి ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. తాజాగా ఆమె కోలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తకరమైన విషయాలను పంచుకుంది. తన కుమార్తె 'తేజ లక్ష్మి' గురించి కొంత సమాచారాన్ని పంచుకుంది. అందులో ఇన్నాళ్లుగా తన కూతురు సినిమాల్లో ఎందుకు నటించలేదని, ఇప్పుడు సినిమాల్లో ఎందుకు నటించబోతుందంటూ పలు విషయాలపై ఆమె మాట్లాడింది.ఊర్వశి ఇటీవల తన కుమార్తెతో కలిసి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అది కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయింది.

ప్రస్తుతం తేజ లక్ష్మి వయసు 23 ఏళ్లు కావడంతో సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆమె చెప్పింది. అందుకే ఆమెను ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయం చేసినట్లు తెలిపింది. 'ఇన్ని సంవత్సరాలుగా నా కూతుర్ని సినిమాల్లో నటించేలా చేయలేదు. కారణం ఏంటంటే.. స్టార్ల వారసులు సినిమాల్లో నటించేందుకు వస్తే.. వాళ్ల పేరెంట్స్‌ ప్రభావం వల్ల జనాలు ఆదరిస్తున్నారు. వారసులకు ఇదే ప్రధాన సమస్యగా ఉంటుంది. అందుకే చదువు పూర్తి చేసి రమ్మని పంపించాను. అయితే ఇప్పుడు ఆమె చదువు పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి తన ఫ్రెండ్స్ సర్కిల్‌లో అందరూ నటించమని చెబుతున్నారని చెప్పింది.

ఆమె కూడా ఇప్పుడు సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపుతోంది. కాబట్టి నేను దానికి అంగీకరించాను.ఇప్పుడు కొన్ని కథలు వింటుంది. ఆమె మొదట్లో సినిమాల్లోకి రాకూడదని భావించింది, కానీ విధి ఆమెను సినిమా వైపు నడిపిస్తుంది. దాన్ని మార్చలేమని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్‌ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వారిద్దరికి జన్మించిన అమ్మాయే తేజ లక్ష్మి. ఆ తర్వాత మనోజ్‌తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుని 2013లో శివ ప్రసాద్‌ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement