Actor Balayya Death: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు బాలయ్య కన్నుమూత

Senior Actor Balayya Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు, దర్శక–నిర్మాత, రచయిత మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మూడొందలకు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య స్వస్థలం గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతంలోని వైకుంఠపురం. మన్నవ గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1930 ఏప్రిల్‌ 9న జని్మంచారు బాలయ్య. పదో తరగతి పాసయ్యాక ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యం సంపాదించుకోడానికి మద్రాస్‌ వెళ్లారు బాలయ్య. అయితే ఇంగ్లీష్‌ మీడియం కాబట్టి తొలి ప్రయత్నంలోనే ఇంటర్‌ పాస్‌ కాలేకపోయారు. కానీ పట్టుదలగా చదవి, ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. అనంతరం మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పట్ట భద్రులయ్యారు. 

ఉద్యోగం మానేసి.. ఇండస్ట్రీలోకి వచ్చి!
కాలేజీ రోజుల్లో జరిగిన అంతరాష్ట్ర నాటక పోటీల్లో ఆచార్య ఆత్రేయ రాసిన ‘ప్రగతి’ నాటకంలో పారిశ్రామికవేత్త పాత్ర చేశారు బాలయ్య. నటుడిగా ప్రథమ బహుమతి లభించింది. బాలయ్య నటించిన నాటకాలకు తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇంజినీరింగ్‌ తర్వాత లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు బాలయ్య. ఆ తర్వాత అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా మరో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే తాను ‘ఎత్తుకు పై ఎత్తు’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నానని, ఇందులో నటించాలని బాలయ్యను ఒప్పించారు తాపీ చాణక్య. తొలి సినిమా తర్వాత బాలయ్య నటుడిగా వెనుతిరిగి చూసుకోలేదు. ‘పార్వతీ కల్యాణం’, ‘భాగ్యదేవత’, ‘కుంకుమరేఖ’, ‘మనోరమ’, ‘చివరకు మిగిలేది’, ‘ఇరుగు పొరుగు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పాండవ వనవాసం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘అంకురం’, ‘యమలీల’, ‘అన్నమయ్య’, ‘మల్లీశ్వరి’, ‘మిత్రుడు’ వంటి పలు చిత్రాల్లో నటించారు. 

తొలి అడుగే హిట్‌...
ప్రముఖ దర్శకుడు విఠలాచార్య ఓ సినిమాలో బాలయ్యకు ఓ పాత్ర ఇస్తానని, చివరి నిమిషంలో కుదరదన్నారట. దీంతో కాస్త నొచ్చుకున్నారట బాలయ్య. తనే సినిమాలు తీస్తే అనే ఆలోచనతో ‘అమృత ఫిలింస్‌’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. చదువుకునే రోజుల్లో ‘తుఫాన్‌’ అనే పత్రికకు రాసిన ‘నలుపు – తెలుపు’ కథలో మార్పులు చేసి శోభన్‌బాబుతో ‘చెల్లెలి కాపురం’ (1971) సినిమాను నిర్మించారు. నిర్మాతగా తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్నారు బాలయ్య. ఆ తర్వాత కృష్ణ హీరోగా ‘నేరము–శిక్ష’ (1973)  నిర్మించారు. ఇంకా ‘అన్నదమ్ముల కథ’  (1975), ‘ఈనాటి బంధం ఏనాటిదో’  (1977), ‘ప్రేమ పగ’ (1978), ‘పసుపుతాడు’ (1986), ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ (1980) వంటి సినిమాలను నిర్మించారు బాలయ్య. నిర్మాత, రచయితగానే కాదు.. ‘ఊరికిచ్చిన మాట’ (1981), ‘నిజం చెబితే నేరమా? (1983)’, ‘పసుపుతాడు’ వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు బాలయ్య. అలాగే ‘చెల్లెలి కాపురం’, ‘నేరము శిక్ష’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘పసుపు తాడు’ చిత్రాలకు రచయితగానూ ప్రతిభ చూపారు బాలయ్య. ‘చెల్లెలికాపురం’ బంగారు నంది అవార్డును, ‘ఊరికిచి్చన మాట’ చిత్రం కాంస్య నంది అవార్డును సాధించాయి. ఇదే చిత్రానికి రచయితగా బాలయ్య బంగారు నంది అందుకున్నారు. నటుడిగా, దర్శక–నిర్మాతగా, రచయితగా బాలయ్య సినీ జీవితం విజయవంతంగా సాగింది. ఇక 1955లో కమలాదేవిని వివాహం చేసుకున్నారు బాలయ్య. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు తులసీరామ్‌ నటుడిగా కొనసాగుతున్నారు. కాగా పుట్టినరోజు నాడే బాలయ్య మరణించడం శోచనీయం. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలయ్య అంత్యక్రియలు శనివారం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top