‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47’ (ఏకే 47) అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సికింద్రాబాద్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్‌లో వెంకటేశ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌కి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ‘‘కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’.
ఈ చిత్రంలో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఆయన ఫస్ట్ లుక్‌పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ కథ అందించడంతో పాటు డైలాగులు రాశారు. అలాగే ‘వాసు’ సినిమాకి మాటలు రాశారు. అయితే దర్శకుడిగా మాత్రం వెంకటేశ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


