తెలుగు తెరపై చందన పరిమళాలు

Sakshi Special Story About SandalWood Actress in Tollywood

తెలుగులో ఎప్పుడూ ముంబయ్‌ భామలదే హవా. ఆ తర్వాత మలయాళ బ్యూటీలది. బెంగళూరు భామలు ఇక్కడ తక్కువే. అప్పట్లో సౌందర్య ఓ వెలుగు వెలిగారు. తర్వాత అనుష్క కూడా పెద్ద రేంజ్‌కి వెళ్లారు. ఇలా అప్పుడప్పుడూ ఒకరిద్దరు వస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కన్నడ భామలు అరడజను పైనే తెలుగుకి వచ్చారు శాండల్‌వుడ్‌ నుంచి వచ్చిన చందన పరిమళాలు రష్మికా మందన్నా, నభా నటేశ్,  కృతీ శెట్టి, శ్రీలీల, శ్రద్ధా శ్రీనాథ్, రచితా రామ్, కావ్యా శెట్టి చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

ఇప్పుడు తెలుగు పరిశ్రమలో టాప్‌ హీరోయిన్లలో రష్మికా మందన్నా ఒకరు. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ కన్నడ బ్యూటీ ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి హిట్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి దక్కిన చాన్స్‌ రష్మిక కెరీర్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకుని వెళ్లింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. అలాగే శర్వానంద్‌ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో కూడా రష్మికాయే హీరోయిన్‌. తెలుగులో ఆమె సంపాదించుకున్న క్రేజ్‌ బాలీవుడ్‌ వరకు చేరింది.

హిందీలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్‌ (అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌ బై’, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’, మరో సినిమా ప్రకటన త్వరలో రానుంది) రష్మిక చేతిలో ఉన్నాయి. ఇక ఒక్క సినిమాతోనే సెన్సేషనల్‌ హీరోయిన్‌ అనిపించుకోవడం ఏ కొందరికో కుదురుతుంది. కృతీ శెట్టి ఈ కోవలోకే వస్తారు. ‘ఉప్పెన’ ద్వారా పరిచయమైన ఈ క్యూట్‌ బ్యూటీకి తెలుగులో మంచి ఆఫర్లు ఉన్నాయి. నిజానికి ‘ఉప్పెన’ సినిమా విడుదలకు ముందే నానీతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో హీరోయిన్‌గా చాన్స్‌ దక్కించుకున్న కృతి ఇటీవల రామ్‌ కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యారు.

మరో తెలుగు సినిమాకు కూడా కృతి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తక్కువ సమయంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయారు కృతీ శెట్టి. మరోవైపు కెరీర్‌లో తొలి అడుగులు వేస్తున్న శ్రీ లీల సైతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీ లీల. అలాVó  హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్న ‘పెళ్లిసందడి’ చిత్రంలో శ్రీ లీలయే కథానాయిక. సేమ్‌ కృతీ శెట్టి మాదిరిగానే తెలుగులో తనది ఒక్క సినిమా విడుదల కాకుండానే శ్రీ లీల రెండు సినిమాలకు సైన్‌ చేయడం విశేషం. ఇక హైదరాబాద్‌లో పుట్టి నప్పటికీ బెంగళూరులోనే పెరిగారు కథానాయిక నభా నటేష్‌. ఆమె మాతృభాష కన్నడ. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ నభా ఖాతాలో ఉంది.

ప్రస్తుతం నితిన్‌ ‘మ్యాస్ట్రో’ (హిందీ చిత్రం ‘అంధాధున్‌’ తెలుగు రీమేక్‌)లో నభా నటేష్‌ హీరోయిన్‌. జాతీయ అవార్డు సాధించిన నాని ‘జెర్సీ’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మరో కన్నడ బ్యూటీ  శ్రద్ధా శ్రీనాథ్‌. ప్రస్తుతం ‘యాత్ర’ ఫేమ్‌ మహి వి రాఘవ్‌ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నారు. ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో కొత్త అయినప్పటికీ రచితా రామ్‌ శాండల్‌వుడ్‌లో పాపులర్‌ హీరోయిన్‌. ‘సూపర్‌ మచ్చి’తో ఆమె తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఇందులో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరో. కన్నడంలో మంచి ఫామ్‌లో ఉన్న మరో బ్యూటీ కావ్యా శెట్టి కన్నడ హిట్‌ ‘లవ్‌ మాక్‌ౖటైల్‌’ తెలుగు రీమేక్‌ ‘గుర్తుందా.. శీతాకాలం’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్‌.
చూశారుగా.. ఇప్పుడు తెలుగులో చందన పరిమళం ఎక్కువగా వీస్తోంది. శాండల్‌వుడ్‌ నుంచి ఇంకెంతమంది కథానాయికలు వస్తారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top