Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది! | Sakshi
Sakshi News home page

Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది!

Published Thu, Apr 20 2023 7:11 PM

Sakshi Special Article On Hello Meera Movie

రాతి పులుసు  'అనే యూరప్ జానపద కథ ఒకటి ఉన్నది. భలే చమత్కారమైన కథ.  వీలయినంత గుర్తున్నది  చెప్పడానికి ప్రయత్నిస్తా రండి.'

ఒకానొక మనిషి కాలినడకన తోవ పట్టుకు పోతున్నాడు. ఎక్కడికో తెలీదు. నడిచీ నడిచీ కడుపులో దహించుకుపోయేంత ఆకలి. మనిషి మట్టి కొట్టుకు పోయి ఉన్నాడు.  జేబులో నాలుగు డబ్బులు ఉండి ఉంటే ఏ బండి చక్రాన్నో పట్టుకునేవాడు. ఆ మాత్రం కూడా లేనట్టు ఉంది. నడవగా నడవగా ఒక ఊరు తగిలింది. మొదట కనపడిన ఇంటి తలుపు ముందు నిలబడి తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమని అడిగాడు. ఇంట్లో ఏముందో ఏంలేదో తెలీదు. ఇతగాడి వాలకం చూస్తే మాత్రం ఏమీ పెట్టబుద్ది అయినట్లు లేదు. రెండో ఇల్లు అంతే, ఆ ఇంటి తరువాత ఒక నాలుగు గడపలు  దాటి అడిగినా అయిదో ఇంట్లో కూడా అదే స్పందన.  మన కథానాయకుడు ఎవరైనా కానీ, ఏమైనా కానీ చాలా తెలివైన వాడు. ప్రాధేయపడి అడిగాం ఫలితం లేదు ఈ ఊరిలో ఇది కాదు పద్దతి అనుకున్నాడు.

ఈసారి తలుపు తట్టిన ఇంటి వారికి మాత్రం తినడానికి  ఏమైనా ఇవ్వండి అని  అడగలేదు. ఇప్పుడే ఇస్తా  ఒక కుండ ఉంటే  ఇవ్వమని అడిగాడు .  కుండ ఇచ్చినావిడ తలుపుకానుకుని ఏం చేస్తాడా అని చూస్తుంది. కుండని అలా నేలమీద పెట్టి అటు ఇటూ కనపడిన మూడు రాళ్లని, కాసింత ఎండు కొమ్మలు, గడ్డి పోచలు  పట్టుకు వచ్చి మూడు రాళ్ల పొయ్యిగా ఆమర్చి దానిపై కుండని పెట్టి పొయ్యి వెలిగించ బోతూ వెనక్కి తిరిగి,  కాసిన్ని మంచి నీళ్లు దొరుకుతాయా అవి ఉంటే చాలు పని అయిపోతుంది అన్నాడు. ఆవిడ కుండ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చి చోద్యం చూస్తుంది. మనవాడు కుండ కింద మంట పెట్టి జేబులో చేయి పెట్టి ఒక గులక రాయిని బయటకు తీశాడు, భక్తిగా కళ్లకద్దుకుని ఆ రాయిని కుండలో జార విడుస్తూ ఆవిడ కేసి చూసి నవ్వాడు మరేం లేదమ్మా పులుసు రాయి అంతే అన్నాడు.  పులుసు రాయా, అదేంటి ఎప్పుడూ వినలేదే ? అని వింత పోయింది ఆవిడ. 

ఈ రాయి వేసి పులుసు కాస్తే  ఉంటుంది , అబ్బా  అని లొట్టలేసి  చూస్తారుగా అంటూ ఒక కర్ర పుల్ల తీసుకుని కుండలో కలియతిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి తిప్పి మరిగిన  నీళ్లు కాసిన్ని నాలుక మీద వేసి   రుచి చూసుకుని అహా అన్నట్టు కనుబొమలు ఎగరేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఈ రాయి చమత్కారం విని ఇరుగింటి ఆశమ్మ, పొరుగింటి పోశమ్మ, ఎదురింటి బూశమ్మ తతిమ్మా అమ్మలు కూడా  చేరారు.  పులుసు తయారీ దారు తనలో తాను అనుకున్నట్టుగా అంటూనే వారికి వినిపించేలా, బావుంది, చాలా బావుంది కానీ  కాస్త చింతపండు, ఉప్పు, ఇంత జీలకర్ర ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఈ మాటలు చెవిన పడ్డమే ఆలస్యం వెంటనే దినుసులు దిగి పోయాయి. చిరు నవ్వుతో వాటిని అందుకుని ఆ నీళ్లలోకి వంపాడు, పులుసు మరుగుతోంది, ఆవిరి తేలుతోంది.

ఏం పర్లేదు కాస్త సమయం పడుతుంది. అన్నట్లూ మీరు పుట్టి బుద్ది ఎరిగిన దగ్గరి నుంచి ఈ ఊరు దాటి పొయిన వారిలా లేరు, ఇక్కడి నుండి దక్షిణం వైపుకు వంద మైళ్ల దూరంలో  జింత్ర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో పండుతాయండి క్యారెట్లు అబ్బో ఎంత రుచి అనుకున్నారు, ప్రపంచంలో  అట్లాంటి కారెట్లు మరెక్కడా దొరకవు. వస్తున్నప్పుడు పాపం ఒక రెండు దుంపలు మీకోసం తేవాల్సింది.  అన్నట్లూ మీ ఊర్లో క్యారెట్ ఎట్లా ఉంటాయి, పర్లేదా?  అనే ప్రశ్న  ముగిసి ముగియకమునుపే  ఒకావిడ  క్యారెట్ బుట్ట పట్టుకు వచ్చింది. ఆ బుట్టలోనే ఒక వైపు ఉర్లగడ్డలు కూడా ఉన్నాయి.  పర్లేదే! చూడ్డానికి  రంగు బాగా ఉన్నాయి, రుచి పరీక్షిస్తే పొలా అని ఒక చేత్తో నాలుగు కేరట్ దుంపలు ఇంకో  చేత్తో ఆరు ఉర్లగడ్డలు  ఆ మరుగు తున్న నీటిలో పడేసీ  మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు.

ఉర్లగడ్డ పడిందిగా పులుసు చిక్కనయింది, ఘుమఘుమలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ పుల్ల పట్టుకు తిప్పి రుచి చూడబోయాడు, ఈ సారి ఒక ఇల్లాలు చేయి చాపింది, పులుసు చుక్కలు  ఆవిడ చేతిలో ఒంపాడు, ఆవిడ తన అరచేతిని నాకేసి తన్మయత్వంగా మొహం పెట్టింది, మరి ఇంట్లో తరిగిన క్యాబేజీ పోగులు ఉన్నాయి అవి కూడా వేద్దామా? అని అడిగింది. దానికేమమ్మా  భాగ్యం? పులుసు రాయి దేనినయినా  రుచితుల్యం చేస్తుంది  పాపం వెళ్లి తెచ్చుకోండి అని ఉదారంగా అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి ఆసారి ఆయిన్ని, ఈసారి ఈయిన్ని దినుసులు చేరుతూనే ఉన్నాయి. ఇంతలో వేటకని అడివికి వెళ్లిన మగవాళ్లు పల్లెకు వచ్చేశారు. నలుగుడు ముక్క లేకుండా పులుసు ఏమిటి అని ఒక పెద్దాయన కోప్పడి తను వేటాడి తెచ్చిన కుందేళ్ల తాజా మాంసం  ముక్కలు అందులో మరగనిచ్చాడు. పులుసు తయారు. అంతకన్నా అద్భుతమైన పులుసు ముందెన్నడూ తిని ఎరగలేదని తిన్నవాళ్లంతా ఏకగ్రీవపడ్డారు.  తాను కూడా ఆ ఊరి అంత మంచివాళ్లని మునెపెన్నడూ ఎరిగి ఉండనని దానయ్య కూడా  ప్రకటించి తన గుర్తుగా ఉంచుకొమ్మని   కానుకగా  ఆ పులుసు రాయిని వారికి ఇచ్చేసి తన దారి తాను చూసుకున్నాడు .

ఈ కథని మా మిత్రుడు శ్రీనివాస్ చదివి కాని, విని కాని  ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయనకు ఈ కథకు  ఉన్న సంబంధం అల్లా, ఎట్లా అయితే ఆ కథలో కథానాయకుడు వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు ఒక మహద్భుతం  చేయవచ్చని నమ్మికతో నడుస్తున్నాడో , శ్రీనివాస్ ది అదే నమ్మిక. సినిమాలు తీయాలి. దాని కొరకు ముందుగా ఒక సినిమా అయినా తీయాలి అనేదే ఆయన లక్ష్యం. చేతిలో మ్యాజిక్ ఉంది. కాని చూసే వాడికి అవి ఖాళీ చేతుల్లా కనపడుతున్నాయే.. మరెలా అని కథ అనే  గులకరాయిని పట్టుకుని ఆయన నడక మొదలెట్టాడు. పిడికిట్లో అది ఒదిగి ఉంది. నడక అనంతరం గుప్పిట విప్పి చూస్తే అది ముత్యంలా తయారయింది.

ఒక పాతికేళ్ల  అమ్మాయి, పేరు మీరా. రేపొక్క రోజు ఆగితే ఎల్లుండి తన పెళ్లి.  బట్టలు తెచ్చుకోడానికి బయలు దేరిన అమ్మాయి సాయంత్రం అయిదు దాటింది.. ఆరు దాటింది.. ఏడయినా ఇల్లు చేరదే ! ఎక్కడా తప్పి పోయింది లేదు .. అమ్మ చేసినా.. నాన్న చేసినా , తమ్ముడు చేసినా.. కాబోయే శ్రీవారు, వారి అమ్మగారు, చిన్ననాటి మిత్రులు ఎవరు చేసినా ఫోన్ ఎత్తుతోంది .. వారితో మాట్లాడుతూనే ఉంది.. జవాబు చెబుతూనే ఉంది. పోని ఇదేమయినా ఇష్టం లేని పెళ్లా అంటే అదేం కాదు.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడబోతుంది. మరేమిటి?

ఇంటి నిండా బంధువులు, విడిదింట్లో మగపెళ్లి వారు, హోటల్ గదుల్లో మిత్రులు అంతా వచ్చి ఉన్నారు. టైలర్ షాపు నుంచి తిన్నగా ఇంటికి రావాల్సిన అమ్మాయి.. ఇంటి వైపు కాక ఊరిని వదిలి పెట్టి హైదరాబాదు నగరం వైపు.. నేషనల్ హైవే మీద ఒంటరిగా కారు నడుపుతూ వెళ్లావలసిన అవసరం ఏంటి? ఇదేం క్రైం థ్రిల్లర్ కాదు, యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ అసలే కాదు. పూర్తిగా సంసార పక్ష సినిమా.. కుటుంబ గాథా చిత్రం. మనుషులు, అనుబంధాలు, నమ్మకాలు, ద్రోహాలు, కాసిన్ని కన్నీళ్లు, గోరంత దీపమంత ధైర్యం వెలుగులో కొండంత భయాన్ని ఎదుర్కొన్న ఒక ఆడపిల్ల కథ. సినిమా అంతా ఇందులో మీరా అన్న పాత్ర వహించిన గార్గేయి తప్పా మరో మనిషి మొహం కనపడదు. ఎన్నో గొంతులు వినపడతాయి. ఎన్నెన్నో భావనలు అర్థమవుతాయి. ఇందులో మనకు వినపడిన ప్రతి  కరుకు గొంతు, ప్రతి మెత్తని పలుకు, ప్రతి కంగారు స్వరం ఆ మనిషి ఎలా ఉండి ఉంటారనేది మనకంటూ ఒక ఊహని కలుగ జేస్తుంది. మనం కళ్లతో సినిమా చూస్తూ.. ఊహల్లో సినిమాలోని పాత్రలని నిర్మించుకుంటాం. ఇంతకన్నా కథని ఏమి చెప్పలేను. ఇదంతా దర్శకత్వ ప్రతిభ . డైరెక్టర్ మూవీ ఇది. తెలుగులో గొప్ప ప్రయోగం ఇది.  సగటు ప్రేక్షకుడి పైన ఉన్న నమ్మకం ఈ సినిమా . గర్వించే మన సినిమా ఇది. 

సినిమా చివరలో సుఖాంతంలో  పెద్ద సమస్య నుంచి మీరా బయట పడుతుంది. ఆ మొహంలో, కళ్లల్లో, పెదవుల మీద గొప్ప రిలీఫ్ . ఆ సమయంలో ఏం చేయాలి? పిడుగును ఒడిసి పట్టి నలిపి పడేసినంత, కొండలని పిండి కొట్టి చెల్లా చెదురు చేసినంత గొప్ప ఫీల్  కావాలి. ఆ విజయాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ అమ్మాయి చేసిన మొట్ట మొదటి పని తన తమ్ముడికి కాల్ కలిపి, బట్టలు కుట్టిన టైలర్‌కి చాలా అవసరంగా డబ్బులు కావాలి. అర్థ రాత్రి దాటి ఉన్నా పర్లేదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు అందించమంటుంది. సూది కుట్టంత చిన్న మనిషి, ఆవిడ అవసరం దగ్గర ఆపేసిన గొప్ప సినిమా ఇది. తప్పక చూడండి.
-అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి

Advertisement

తప్పక చదవండి

Advertisement