Romantic Review: రొమాంటిక్‌ సినిమా ఎలా ఉందంటే..

Romantic Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : రొమాంటిక్‌
నటీనటులు : ఆకాశ్‌ పూరీ, కేతికా శర్మ,  రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు
నిర్మాణ సంస్థలు : పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ 
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ
దర్శకత్వం : అనిల్‌ పాదూరి
సంగీతం : సునీల్‌ కశ్యప్‌
సినిమాటోగ్రఫీ :  నరేష్ రానా
విడుదల తేది : అక్టోబర్‌ 29,2021

పూరీ జగన్నాథ్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్‌ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్‌ ట్రాక్‌ ఎక్కించాలని ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్‌, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్‌’పై హైప్‌ క్రియేట్‌ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్‌ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ సినిమాతో పూరీ తనయుడు ఆకాశ్‌ హిట్‌ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం.

Akash Puris Romantic Movie Review

కథేంటంటే...

గోవాకి చెందిన వాస్కోడి గామా(ఆకాశ్‌ పూరీ) పక్కా ఆవారా. ఆయన తండ్రి ఓ సిన్సియర్‌ పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్‌ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం మొదలెడతాడు. వచ్చిన డబ్బుతో తన నానమ్మ పేరుతో మేరీ ట్రస్ట్‌ని నెలకొల్పి తన బస్తీ వాసులకు ఇళ్లు నిర్మించి వసతులు కల్పిస్తుంటాడు. పెద్ద పెద్ద నేరాలు చేసైనా సరే.. తన బస్తీవాసులకు ఇల్లు కట్టించాలనుకుంటాడు. దీనికోసం గోవాలో పేరుమోసిన ఓ డ్రగ్స్‌ ముఠాలో చేరుతాడు. అనూహ్య పరిణామాల వల్ల ఆ గ్యాంగ్‌కే లీడర్‌ అవుతాడు. ఈ క్రమంలో అతనికి మోనిక (కేతిక శ‌ర్మ‌) పరిచయం అవుతంది. ఆమెను చూసి మోహంలో పడతాడు. చివరకు అది ప్రేమగా మారుతుంది. మరోవైపు వాస్కోడిగామా గ్యాంగ్ ఆగడాలకు కళ్లెం వేయడానికి గోవాలో కొత్త‌గా అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య‌ గోవార్క‌ర్ (ర‌మ్య‌కృష్ణ‌). వాస్కోడిగామాను పట్టుకొని, ఆ గ్యాంగ్‌ని అంతమొందించడమే ఆమె లక్ష్యం. మ‌రి ఏసీపీ ర‌మ్య వ‌ల‌లో వాస్కోడిగామా చిక్కాడా లేదా?  మోనిక‌తో మోహం ఏమైంది? నిజానికి అది మోహ‌మా, ప్రేమా? అనేదే ‘రొమాంటిక్‌’కథ.

Romantic Cinema Review

ఎవరెలా చేశారంటే...

గ్యాంగ్‌ స్టర్‌ వాస్కోడి గామాగా ఆకాశ్‌ పూరీ అదరగొట్టేశాడు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. తన నటనలో మెచ్యూరిటీ ఎంతో కనిపించింది.  ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది. అయినప్పటికీ.. అకాశ్‌ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఫైట్స్‌ తో పాటు రొమాంటిక్‌ సీన్స్‌లో కూడా అద్భుత నటనను కనబరిచాడు. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా జనాలకు గుర్తిండిపోతుంది.

ఇక మోనిక పాత్రకి పూర్తి న్యాయం చేసింది కేతికాశర్మ. రొమాంటిక్‌ సీన్స్‌లో అద్భుత నటనను కనబరిచి కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది. క్లైమాక్స్‌లో ఆమె ఫెర్పామెన్స్‌ అద్భుతమనే చెప్పాలి. ఇక ఆకాశ్‌ పూరీ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర రమ్యకృష్ణది. ఏసీపీ రమ్య గోవార్కర్‌ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఆకాశ్‌, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్‌ నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్‌ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్‌, అతని భార్యగా యాంకర్ సునైనా  తమ పాత్రలకు న్యాయం చేశారు. 

Romantic Telugu Movie Review

ఎలా ఉందంటే...?

పూరీ సినిమాల్లో హీరోలే విలన్స్‌గా ఉంటారు. ఒక మంచి పని చేయడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. ‘రొమాంటిక్‌’కథ కూడా అంతే. కానీ దీనికి కొంత ‘రొమాంటిక్‌’టచ్‌ ఇచ్చాడు దర్శకుడు, పూరీ శిష్యుడు అనిల్‌ పాదూరి. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ కథ, కథణం, స్క్రీన్‌ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరి గ‌త సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మ‌ర్‌లో` అనే త‌త్వం హీరోది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొల‌వ‌ని ఓ కుర్రాడు.. సడన్‌గా డాన్ అయిపోవ‌డం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయ‌డం.. అంతా సినిమాటిక్‌గా ఉంటుంది.

అయితే లాజిక్‌లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్‌ రాసుకున్నాడు. ప్రతి సీన్‌లోనూ, డైలాగ్స్‌లో పూరీ మార్క్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.  సినిమాలో కొత్తదనం లేకున్నా.. తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్‌ కొట్టకుండా చూసుకున్నాడు పూరీ. ఫస్టాఫ్‌ కొంచెం స్లో అనిపించినప్పటికీ.. సెకండాఫ్‌ చాలా ఫాస్ట్‌గా ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్యం సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం.. పూరి మార్క్ డైలాగులు. ఒక్కో డైలాగ్‌ బుల్లెట్లలా దూసుకెళ్తాయి. నరేష్ రానా సినిమాటోగ్రఫీ బాగుంది.  గోవా నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని చాలా క‌ల‌ర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెర‌కెక్కించాడు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. లాజిక్కులు పక్కనపెట్టి సినిమా చూస్తే.. ఎంజాయ్‌ చెయ్యొచ్చు. కానీ  కొత్తదనం ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది.

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top