రాకెట్రీలో ఆ సీన్‌ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్‌, హీరో దెబ్బకు ట్వీట్‌ డిలీట్‌!

Rocketry: The Nambi Effect Hero Madhavan Counter To Netizen - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ మాధవన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తీయడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన అభిమానులైతే గొప్ప సినిమా చేశావంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఓ నెటిజన్‌.. 'నిన్న రాకెట్రీ సినిమా చూశాను. చివరి సీన్‌ ఏదైతే ఉందో దాన్ని పదేపదే చూశాను. మీ తొలి దర్శకత్వమే అద్భుతంగా ఉంది. ఇక నటనకు కొంచెం కూడా వంక పెట్టాల్సిన పని లేదు' అంటూ హీరో మాధవన్‌ను ట్యాగ్‌ చేశాడు. దీంతో మాధవన్‌ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. 'నువ్వు ఒక్క సన్నివేశాన్నే పదే పదే ఎలా చూడగలిగావు?' అని ప్రశ్నించాడు. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న నెటిజన్‌ వెంటనే తన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.

కానీ అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇతర నెటిజన్లు నెట్టింట వైరల్‌ చేశారు. సినిమా వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ మూవీ ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరి అతడు నచ్చిన సన్నివేశాన్ని పదే పదే చూశాడంటే అది థియేటర్‌లో సాధ్యపడదు. అంటే అతడు పైరసీ ద్వారా సినిమా చూశాడని ఇట్టే తెలిసిపోతుంది. అతడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా మ్యాడీ కౌంటర్‌ ఇవ్వడంతో నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు.

చదవండి:  ప్రేయసితో హృతిక్‌ రోషన్‌ రోడ్‌ ట్రిప్‌, వీడియో చూశారా?
తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్‌, పిల్లలు పుట్టాక పెళ్లి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top