
నిన్నటిని మరిచిపో.. రేపటి గురించి తలచుకోకు..నేటిని మనస్ఫూర్తిగా ఆస్వాదించు. ఆనందమయ జీవితానికి ఇదే ప్రధాన సూత్రం. సంపాదించిన దాన్ని ఆనందంగా అనుభవించు. అప్పుడు వయసు గుర్తుకు రాదు. మనసు సంతోషంతో ఉరకలేస్తుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే నటి రాధిక శరత్ కుమార్ గురించే. ఈ డేరింగ్ నటి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దివంగత నటుడు ఎంఆర్.రాధ వారసురాలు అయిన రాధిక లండన్ లో చదివి చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత భారతీరాజా దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
'కిలక్కే పోగులు రైల్' అనే చిత్రం ద్వారా కథానాయికిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం 1978లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే ఆ తరువాత తమిళం,తెలుగు తదితర భాషల్లో స్టార్ హీరోలందరితోనూ జత కట్టి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. అదేవిధంగా బుల్లితెరలోనూ నటిగా, నిర్మాతగా విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం అమ్మ, అక్క పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈమె వయసు 63 ఏళ్లు. అయినా అందం, వేగం, చురుకుతనానికి వయసుతో పనేముంది.
తాజాగా నటి రాధిక తన 63వ పుట్టినరోజును స్నేహితులు సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో నటి త్రిష ,రమ్యకృష్ణ, మీనా, నిరోషా మొదలగు పలువురు నటీమణులు పాల్గొన్నారు. అలా ఈ అందరి మగువల మధ్య ఒకే ఒక్క మగాడు అన్నట్లుగా నటుడు,రాధిక జీవిత భాగస్వామి శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ ఫొటోను నటి మీనా తన సామాజిక మాధ్యమాలో విడుదల చేశారు.అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.