దీనస్థితిలో పావలా శ్యామల.. అండగా నిలిచిన దిల్‌ రాజు! | Producer Dil Raju Help To Pavala Shyamala | Sakshi
Sakshi News home page

నడి రోడ్డుపై దీనస్థితిలో పావలా శ్యామల.. అండగా నిలిచిన దిల్‌ రాజు!

May 16 2026 6:16 PM | Updated on May 16 2026 6:42 PM

Producer Dil Raju Help To Pavala Shyamala

అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటి పావలా శ్యామలకు నిర్మాత దిల్‌ రాజు అండగా నిలిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు దిల్ రాజు తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాడు. తన మేనేజర్ల ద్వారా అక్కడి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

కాగా, గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, డబ్బులు లేవని ఆమెను బయటకు పంపించేశారు. క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెను అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.  ఆమెను పట్టించుకునేవారే లేరని, తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించాడు.

తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్‌లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, ‘శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్‌లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.

కన్నీళ్లు పెట్టుకున్న శ్యామల
దిల్ రాజు టీమ్ పావలా శ్యామలను కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో కూడా చాలా సార్లు దిల్‌ రాజు సహాయం చేశాడని..మరోసారి తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అని శ్యామల పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement