‘ఏజెంట్‌’ ఫలితం నన్ను మార్చింది.. మళ్లీ ఆ తప్పు జరగదు: నిర్మాత | Sakshi
Sakshi News home page

‘ఏజెంట్‌’ ఫలితం నన్ను మార్చింది.. మళ్లీ ఆ తప్పు జరగదు: నిర్మాత

Published Tue, Jul 4 2023 3:50 AM

producer anil sunkara at samajavaragamana movie - Sakshi

'ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. వాటి ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయం వస్తోంది. ఏప్రొడ్యూసర్‌కి డబ్బులు వచ్చినా అది ఇండస్ట్రీకి వచ్చినట్లే. రేపు మా సినిమా కూడా రీ రిలీజ్‌కి రావచ్చు.. అది నిర్మాతలకు మంచిదే' అని నిర్మాత అనిల్‌ సుంకర అన్నారు. శ్రీవిష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మించిన ఈ సినిమా జూన్‌ 29 విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్‌ సుంకర మాట్లాడుతూ...

► ‘సామజ వరగమన’ మా యూనిట్‌ నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ విజయం చాలా తృప్తి ఇచ్చింది. ఈ కథకు శ్రీ విష్ణు కరెక్ట్‌గా సరిపోయాడు. మహేశ్‌ బాబు, నాని, శ్రీవిష్ణు... ఇలా ఎవరి మార్కెట్‌ వాళ్లది. ‘సామజ వరగమన’ని తమిళంలో రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉంది. ఇదే కాంబినేషన్‌లో మళ్లీ ఓ సినిమా ఉంటుంది.

► ‘ఏజెంట్‌’ ఫలితం విషయంలో యూనిట్‌ అందరి తప్పు ఉంది. కొన్ని కారణాల వల్ల బౌండ్‌  స్క్రిప్ట్‌తో వెళ్లలేకపోయాం. ఇకపై పూర్తి కథ లేనిదే ఏ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లను. పెద్ద సినిమాలకు కాంబినేషన్‌ని బట్టి బిజినెస్‌ ఉంటుంది. కానీ, చిన్న సినిమాలకు కొంచెం రిస్క్‌ ఉంటుంది. కథ బాగుంటేనే వర్కవుట్‌ అవుతాయి.

► మా బ్యానర్‌లో తీసిన ‘హిడింబ’ ట్రైలర్‌ నచ్చడంతో టేబుల్‌ ప్రాఫిట్‌ బిజినెస్‌ జరిగింది. అలాగే ‘ఊరు పేరు భైరవ కోన’ కంటెంట్‌ కూడా యూనిక్‌గా ఉంటుంది. చిరంజీవిగారితో తీస్తున్న ‘భోళా శంకర్‌’ ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఆగస్ట్‌ 11న సినిమా విడుదలవుతుంది. కీర్తి సురేష్‌, చిరు మధ్య ఉండే సీన్లు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement