మేము విడిపోవాలని కోరుకుంటున్నారా.. విడాకులపై ప్రియాంక | Priyanka Chopra comment on her divorce rumors | Sakshi
Sakshi News home page

మేము విడిపోవాలని కోరుకుంటున్నారా.. విడాకులపై ప్రియాంక

Mar 26 2026 7:32 AM | Updated on Mar 26 2026 11:40 AM

Priyanka Chopra comment on her divorce rumors

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ నాలుగేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి రూమర్స్‌కు గతంలోనే చెక్‌ పెట్టిన ఆమె తాజాగా మరోసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. తాను సోషల్‌మీడియాలో ఏదైనా ఫొటోని  పంచుకుంటే ఏవేవో ఊహించుకుంటుంటూ కొందరు అదేపనిగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక తాజాగా తన భర్త నిక్‌ జొనాస్‌ గురించి మాట్లాడారు.

ప్రియాంక చోప్రా.. నిక్‌ జొనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాము ఇద్దరం జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. బయటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వమని ఆమె అన్నారు. అయితే, తాము విడాకులు తీసుకుంటున్నామంటూ కొన్ని కథనాలు వచ్చినట్లు తెలిసిందన్నారు. తమ వివాహబంధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారా..? అని ఆమె ప్రశ్నించారు. తరచుగా ఇలాంటి రూమర్స్‌ ఎందుకు వైరల్‌ చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. 

'మేము వేర్వేరు దేశాలకు చెందడంతో పాటు వేర్వేరు మతాలు, మా ఇద్దరి మధ్య వయసు తేడా ఇలా కొన్ని కారణాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎనిమిదేళ్లుగా మేము చాలా సంతోషంగా కలిసే ఉంటున్నాం. నిక్‌ జొనాస్‌ పరిచయం అయిన తర్వాత ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. మా గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం మానేశాను. నిక్‌ని కలిశాక.. తానే నా జీవితానికి సరైన జోడీ అనిపించి మరో అడుగు ముందుకువేశాను' అని క్లారిటీ ఇచ్చారు.

తన కుటుంబ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రియాంక చోప్రా చెప్పారు. తన కుమార్తె మాల్టి మేరి గురించి చాలా అప్రమత్తంగా ఉంటానని ఆమె అన్నారు. తమ అనుమతి లేకుండా చాలామంది మాల్టి మేరి ఫోటోలు తీసి నెట్టింట వైరల్‌ చేయడం తనకు నచ్చదని ఆమె తెలిపారు. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకే సెక్యూరిటీని పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, తనతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చని ఆమె క్లారిటీ ఇచ్చింది. కానీ, తన కూతురి ప్రైవసీని కాపాడటం తన బాధ్యతని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement