ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా చుట్టూ పుకార్లు ఆగడం లేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని రూమర్లకు క్లారిటీ ఇచ్చినా, మరికొన్ని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌తో పాటు ఈ సినిమాలో హీరో గోపీచంద్ కూడా నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ‘స్పిరిట్’లో ఓ కీలక పాత్ర కోసం ఆయనను ఎంపిక చేశారట. అయితే అది పాజిటివ్ క్యారెక్టరా లేక నెగెటివ్ క్యారెక్టరా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు. తనకు అవకాశం దొరికితే ప్రభాస్ సినిమాలో తప్పకుండా నటిస్తానని గోపీచంద్ గతంలోనే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ‘స్పిరిట్’తో ఆ అవకాశం నిజమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయిన గోపీచంద్ మార్కెట్ కొంత డల్ అయింది. అలాంటి సమయంలో ప్రభాస్ సినిమా వంటి భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర చేయడం ఆయన కెరీర్‌కు మళ్లీ బూస్ట్ ఇవ్వొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
విలన్ పాత్రపై గాసిప్
ఇప్పుడు నాకు విలన్ పాత్రలు చేయాలని లేదు. కానీ ఆ పాత్రలో డెప్త్ ఉంటే మాత్రం చేస్తాను. ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని గోపీచంద్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. సందీప్ వంగ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ‘యానిమల్’ చూసినవారికి తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’లో గోపీచంద్‌ను విలన్‌గా చూపించబోతున్నారనే గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై సినిమా యూనిట్ మాత్రం స్పందించలేదు. గోపీచంద్ నిజంగా ‘స్పిరిట్’లో నటిస్తున్నారా? ఆయన పాత్ర ఏదీ? అన్నది మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు మిస్టరీనే.


