పచ్చి బూతులు తిట్టారు, భయంతో బయటకు రాలేదు : పోసాని వాచ్‌మెన్ భార్య

posani krishna murali House Attack: సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని, ఆయన భార్యను పచ్చి బూతులు తిడుతూ ఆయన ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని ఆ ఇంట్లో పనిచేసే వాచ్ మెన్ భార్య శోభ మీడియాకు తెలిపారు. బుధవారం అర్థ రాత్రి పోసాని కృష్ణ మురళి నివాసంపై రాళ్లతో దాడికి దిగారు. అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్లతో దాడికి దిగారని తమకు అనుమానం ఉందని ఆయన ఇంటి వాచ్‌మెన్ భార్య శోభ చెప్పారు. ఇద్దరి వ్యక్తుల మాటలు విన్పించినట్టుగా ఆమె తెలిపారు.దాదాపుగా 8 నెలలుగా పోసాని కృష్ణ మురళి దంపతులు ఈ నివాసంలో ఉండడం లేదని ఆమె చెప్పారు.
(చదవండి: పవన్ కల్యాణ్ ఊసరవెళ్లి రాజకీయాలపై ప్రశ్నిస్తే తప్పా : పోసాని)
తమకే ఇంటిని అప్పగించి వెళ్లారని ఆమె చెప్పారు. దీంతో రాత్రి పూట తాము ఈ ఇంటి వద్దే నిద్రిస్తామని తెలిపారు. రెండు రోజులుగా పోసాని కృష్ణ మురళిని దూషిస్తూ కొందరు తిరుగుతున్నారని ఆమె చెప్పారు. బుధవారం రాత్రి పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారని, భయంతో తాము ఇంట్లోనుంచి బయటకు రాలేదన్నారు. చివరకు పురుషోత్తం అనే వ్యక్తి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆమె తెలిపారు.
కాగా, గతకొన్ని రోజులుగా పవన్, పోసాని మధ్య మాటల యుద్ద జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడ పోసాని కృష్ణ మురళి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో మీడియా సమావేశం పాల్గొని, తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆయనపై దాడికి ప్రయత్నించారు.