
పాకిస్తాన్‌లో ఇటీవల నటీనటుల మరణవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఊహించని విధంగా నటీమణలు సూసైడ్ చేసుకోవడం పాక్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతనెల 20న పాకిస్తాన్ నటి ఆయేషా ఖాన్ (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్.. కరాచీలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించింది. ఇలా హఠాత్తుగా ఆమె మరణించడం పాక్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.
తాజాగా మరోసారి అలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (Humaira Asghar Ali) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు కాగా.. కరాచీలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించింది. అయితే ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో చనిపోయి దాదాపు మూడు వారాలకు పైగానే అయినట్లు తెలుస్తోంది.
కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో హుమైరా అస్గర్ అలీ గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే నివసిస్తోంది. గత మూడు వారాలుగా ఆమె స్థానికులకు కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడగా.. నటి శవమై కనిపించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమె మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లాహోర్‌కు చెందిన హుమైరా హుమైరా అస్గర్ ప్రముఖ రియాలిటీ షో తమాషా ఘర్‌లో నటించింది. ఆ తర్వాత 2015లో యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. జలైబీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు లాంటి పాకిస్తాన్ సీరియల్స్‌లో నటించింది. ఆమె చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా 2021లో విడుదలైంది.
అంత్యక్రియలకు నిరాకరించిన తండ్రి..
అయితే హుమైరా మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ నిరాకరించారు. తమతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిపారు. చాలా ఏళ్ల క్రితమే మాతో సంబంధాలు తెంచుకుందని చెప్పారు. మృతదేహాన్ని మీరే ఏదైనా చేసుకోండని అధికారులతో అన్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో సింధ్ సాంస్కృతిక విభాగం ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమానికి నటులు యష్మా గిల్, సోన్యా హుస్సేన్ కూడా ముందుకొచ్చారు.