Operation Valentine Movie Review: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రివ్యూ

Operation Valentine Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ఆపరేషన్‌ వాలెంటైన్‌
నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు
నిర్మాతలు: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద
దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా
సంగీతం: మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతం
ఎడిటర్‌: నవీన్‌ నూలి
విడుదల తేది: మార్చి 1, 2024

కథేంటంటే.. 
అర్జున్‌ రుద్ర దేవ్‌ అలియాస్‌ రుద్ర(వరుణ్‌ తేజ్‌) భార‌తీయ వైమానిక ద‌ళంలో వింగ్‌ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్(మానుషి చిల్ల‌ర్‌)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా..  గ‌గ‌న‌వీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్‌. అలా ఓ సారి ప్రాజెక్ట్ వ‌జ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్‌ కమాండర్‌ కబీర్‌(నవదీప్‌) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ప్రాజెక్ట్‌ వజ్రను బ్యాన్‌ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్‌ వాలెంటైన్‌ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్‌ వాలైంటైన్‌ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్‌ రుద్ర తన టీమ్‌తో కలిసి పాకిస్తాన్‌ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్‌ని క్రాస్‌ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్‌ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్‌ అయిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చూడాల్సిందే. 


ఎలా ఉందంటే.. 
2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిని దేశం ఇప్పటికి మర్చిపోలేదు. ఈ దాడిలో 40 మందికిపైగా భారతీయ జవాన్లు వీర మరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్‌ బాల్‌కోట్‌ స్ట్రైక్‌ నిర్వహించి సక్సెస్‌ అయింది. ఈ ఘటనల ఆధారంగానే దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ తెరకెక్కించాడు. ఇందులో దేశ రక్షణ కోసం వైమానిక దళం ఎలా పని చేస్తుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. 

వాస్తవానికి వేరే దేశంతో యుద్ధం అనగానే అందరికి సైనిక దళమే గుర్తొస్తుంది. కానీ వారితో పాటు నావిక, వైమానిక దళం కూడా దేశ రక్షణ కోసం పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నావిక, వైమానిక దళాలపై సినిమాలు కూడా పెద్దగా రాలేదు. కానీ బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ తర్వాత మన వైమానిక దళం గొప్పదనం ప్రపంచానికి మొత్తం తెలిసింది. గ‌న‌త‌లంలో వాళ్లు చేసే పోరాటల గురించి అంతా చర్చించుకున్నారు. బాలీవుడ్‌లో ఆ నేపథ్యంతో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే ‘ఫైటర్‌’ అనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చి..బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది.  ఆపరేషన్‌ వాలెంటైన్‌ కాన్సెప్ట్‌ కూడా అలాంటిదే. అయితే  ఇలాంటి నేపథ్యంతో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ ’ అనే చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్‌(రూ.42 కోట్లు అని సమాచారం) ఇంత రిచ్‌గా సినిమాను తెరకెక్కించిన దర్శకుడుని అభినందించాల్సిందే. 

అయితే ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్‌ చాలా ముఖ్యం. ఆపరేషన్‌ వాలెంటైన్‌లో అది మిస్‌ అయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పుల్వామా దాడిని మరింత ఎమోషనల్‌గా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యేలా చూపిస్తే బాగుండేదేమో. అలా అని ఎమోషన్‌ పూర్తిగా పండలేదని చెప్పలేం. దాడిలో ఓ సైనికుడు త‌న ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడిన సీన్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ తరహా ఎమోషనల్‌ సీన్స్‌ కొచ్చి చోట్ల ఉంటే సినిమా మరింత కనెక్ట్‌ అయ్యేది. 

దర్శకుడు వైమానిక దళ సైనికుల ఆపరేషన్స్‌, సాహసాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. చాలా సహజంగా వాటిని తెరపై చూపించాడు కానీ కథలోని డ్రామాని మాత్రం తెరపై సరిగా పండించలేకపోయాడు.ప్రాజెక్ట్‌ వజ్రతో కథను ప్రారంభించాడు. ఆ  ఒక్క సీన్‌తోనే హీరో  పాత్ర ఎలాంటిదో తెలియజేశాడు. ఫస్టాప్‌ అంతా పైలెట్ల టెస్ట్‌, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టునే తిరుగుతుంది. అయితే ప్రేమ కథలో గాఢత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. పాకిస్తాన్‌పై మన సైనికులు దాడి చేసే సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. పాకిస్తాన్‌ చేపట్టిన ఆపరేషన్‌ నెహ్రుని తిప్పికొట్టేందుకు హీరో చేసే సాహసం.. చివరల్లో ఆపరేషన్‌ వజ్రని ప్రయోగించడం ప్రతీది.. ఆకట్టుకుంటుంది. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ థియేటర్స్‌ని నుంచి బయటకు వస్తారు. 

ఎవరెలా చేశారంటే.. 
అర్జున్‌ రుద్ర దేవ్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఒదిగిపోయాడు. తెరపై నిజమైన వింగ్‌ కమాండర్‌గానే కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వెజ్‌, మాటలు ప్రతీది నిజమైన సైనికుడినే గుర్తు చేస్తుంది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్‌గా మానుషిచిల్ల‌ర్‌ అద్భుతంగా నటించింది. సినిమాలో తన పాత్రను మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోహీరోయిన్ల మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్‌ కాలేదు. కబీర్‌గా నవదీప్‌ ఒకటి రెండు సన్నివేశాల్లోనే కనిపించాడు. ఆయన పాత్రకు డైలాగ్స్‌ కూడా లేవు. మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిక్కి జే మేయర్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. వందేమాతరం సాంగ్‌ ఆకట్టుకుంటుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ చాలా రిచ్‌గా చిత్రీకరించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:  
(3/5)

Election 2024

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top