
'ఓజీ' సినిమా. ఈ పేరు చెప్పగానే చాలామంది పవన్ కల్యాణ్ అంటారేమో! కానీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజీత్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాసరే ముచ్చటగా మూడంటే మూడు మూవీస్ మాత్రమే చేశాడు. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ పిలిచి మరీ ఛాన్స్‌లు ఇచ్చారంటే మనోడిలో మేటర్ చాలానే ఉందని అర్థమవుతోంది. అసలు ఇంతకీ ఇతడెవరు? డైరెక్టర్ ఎలా అయ్యాడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఒకప్పుడు దర్శకుడు కావాలంటే కచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్‌గా చాలా ఏళ్లు పనిచేయాల్సి వచ్చేది. కానీ 2010, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చాలామంది యూత్.. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ తమలోని టాలెంట్ బయటపెట్టారు. అలాంటి కుర్రాళ్లలో ఒకడే సుజీత్. పుట్టింది అనంతపురం. చెన్నైలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. సినిమా అంటే పిచ్చి. దీంతో 17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాడు. పూరీ జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేయాలనేది ఇతడి ఆలోచన. కానీ పూరీని కలిసిన తర్వాత ఆ ఆలోచనని పక్కనపెట్టి, సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం షురూ చేశాడు.
(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ)
అలా 30 వరకు లఘ చిత్రాలు తీశాడు. అయితే ఓ తెలుగు టీవీ ఛానెల్ నిర్వహించిన కాంటెస్ట్‌లో పాల్గొని 'రన్ రాజా రన్' అనే షార్ట్ ఫిల్మ్‌తో విజేతగా నిలిచాడు. దీంతో యువీ క్రియేషన్స్ నుంచి ఇతడికి ఆఫర్ వచ్చింది. తొలుత ఓ లవ్ స్టోరీని వాళ్లకు చెప్పాడు. నిర్మాతలకు బాగానే నచ్చింది కానీ బడ్జెట్ సమస్యల వల్ల దీన్ని పక్కనబెట్టేశారు. ఆ బాధలో వర్షంలో బండి తోసుకుంటా ఇంటికెళ్లాడు. తల తుడుచుకుంటున్న టైంలో ఓ కథ ఫ్లాష్ అయింది. మూడు రోజుల్లో ఆ స్టోరీని పూర్తిగా రాసి నిర్మాతలకు వినిపించాడు. అదే 'రన్ రాజా రన్' సినిమా.
శర్వానంద్‌తో తీసిన ఈ మూవీ హిట్ అయింది. దీంతో ఓ రోజు మాటల సందర్భంలో ప్రభాస్.. 'బాహుబలి' షూటింగ్ టైంలో సుజీత్‌ని కలిసి ఏదైనా కథ ఉంటే చూడు డార్లింగ్ అని అన్నాడు. అలా ఓ స్టోరీని అనుకుని వినిపించాడు. అదే 'సాహో'. మేకింగ్ పరంగా హాలీవుడ్‌లో రేంజ్‌లో ఉంటుంది. మరి 'బాహుబలి' తర్వాత రావడం వల్లనో ఏమో గానీ అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయింది. రూ.350 కోట్ల బడ్జెట్ పెడితే అంతకు మించే కలెక్షన్స్ వచ్చాయి గానీ అందరినీ సంతృప్తి పరచలేకపోయింది.
(ఇదీ చదవండి: మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్!)
'సాహో' తర్వతా సుజీత్‌కి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ వచ్చాయి. అలా కొన్నేళ్ల పాటు హిందీలో సినిమా చేయాలని తెగ ప్రయత్నించాడు కానీ అదృష్టం కలిసి రాలేదు. దీంతో తిరిగి టాలీవుడ్‌కి వచ్చేశాడు. ఆ టైంలో చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం చేసే ఛాన్స్ మొదట ఇతడికే వచ్చింది. కానీ రీమేక్ అని నో చెప్పేశాడు. తర్వాత పవన్ కల్యాణ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిస్తే ఓ రీమేక్ చేయాలని ఆఫర్. కానీ సొంత కథతోనే మూవీ చేస్తానని చెప్పి ఓ స్టోరీ రెడీ చేశాడు. అదే 'ఓజీ'.
2022 నుంచి దాదాపు మూడేళ్ల పాటు తీసిన చిత్రమే 'ఓజీ'. అయితే ఈ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ అయ్యిండొచ్చు, తమన్ తన మ్యూజిక్‌తో వైబ్ తీసుకురావొచ్చు. కానీ దీనంతటికి కారణం మాత్రం సుజీత్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. తన విజన్‌తో అందరూ తన గురించి, సినిమా కోసం మాట్లాడుకునేలా చేశాడు. నెక్స్ట్ నానితో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుంది.
సుజీత్.. 2020లోనే ప్రవల్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొన్న జరిగిన 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈమెతో పాటు కనిపించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈమె హైదరాబాద్‌లోనే డెంటిస్ట్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది)