
సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు (Nampally Court ) ఊరట కల్పించింది. పలు షరతులతో ఆయనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు తాజాగా వాటిలో సడలింపు ఇచ్చింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చిక్కడపల్లి పోలీసుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో బన్నీకి కోర్టు మినహాయింపు ఇచ్చింది.
అల్లు అర్జున్ (Allu Arjun) గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా అక్కడికి వెళ్లారు. దీంతో కాస్త ఇబ్బంది వాతావరణం అక్కడ కనిపించింది. ఇలాంటి సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి స్టేషన్‌కు వెళ్లడం వల్ల సెక్యూరిటీ పరంగా పలు ఇబ్బందులు వస్తున్నాయని కోర్టులో ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. తాజాగా విచారించిన న్యాయస్థానం బన్నీకి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం కోరింది.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు)
పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్ (చిక్కడపల్లి)లో హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు ఈ అంశంలో ఆయనకు సడలింపు ఇచ్చింది.

డిసెంబర్ 5న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీతేజ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా అల్లు అర్జున్ పరామర్శించి వచ్చారు. బాలుడికి కావాల్సిన వైద్య సదుపాయం అల్లు అర్జున్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ప2 చిత్ర యూనిట్ రూ. 2 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.