
హీరో నాగచైతన్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందా? అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఓ మాస్ కథను నాగచైతన్యకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారని, అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది.
అలాగే తనకు ‘మజిలీ’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ ఇచ్చిన శివ నిర్వాణ చెప్పిన కథ కూడా విన్నారు నాగచైతన్య. మరి... ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో నాగచైతన్య సినిమా ముందుగా సెట్స్‌కు వెళ్తుంది? లేకపోతే ఈ ఇద్దరు దర్శకులతో నాగచైతన్య సమాంతరంగా రెండు సినిమాలూ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు నాగచైతన్య. ఇది నాగచైతన్య కెరీర్‌లోని 24వ చిత్రం. దీంతో నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు ఏ దర్శకుడు ఖరారు అవుతారో అనే ఆసక్తి అక్కినేని ఫ్యాన్స్‌లో నెలకొంది.