ఆలయాన వెలసిన కథలతో పూనకాలు తెప్పిస్తున్న స్టార్స్‌

Movies telling about of temple story in Tollywood - Sakshi

పూనకాలు తెప్పించే, భక్తి పారవశ్యంలో ముంచే భక్తి రసాత్మక చిత్రాల నిర్మాణం తగ్గింది. పూర్తి స్థాయి భక్తి చిత్రాలంటే కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతాయా? అనే సందేహం ఉన్న నేపథ్యంలో ఆ తరహా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు దాదాపు ముందుకు రావడంలేదు. అయితే కమర్షియల్‌ కథల్లో భక్తి జోడించి, సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. ఇలా ఆలయాన  వెలసిన కథలతో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.

శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, శరత్‌కుమార్, శివ రాజ్‌కుమార్, బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాస్తికుడైన ఓ యోధుడు శివ భక్తునిగా ఎలా పరివర్తన చెందాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలు శివాలయం నేపథ్యంలో ఉంటాయి. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా తెరకెక్కుతోంది. సుమంత్, మీనాక్షీ గోసామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జాగర్లపూడి సంతోష్‌ దర్శకుడు. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతదర్శకుడు. ఈ సంగతి ఇలా ఉంచితే... హీరో సుమంత్, దర్శకుడు జాగర్లపూడి సంతోష్‌ కాంబినేషన్‌లో 2018లో వచ్చిన హిట్‌ ఫిల్మ్‌ ‘సుబ్రహ్మణ్యపురం’లో లైట్‌గా భక్తి టచ్‌ ఉంది. తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’లో కాస్త ఎక్కువ ఉంటుంది.

హీరో సందీప్‌ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఇందులో కావ్యా థాపర్, వర్షా బొల్లమ్మ హీరోయిన్లు. భైరవకోన అనే ఊరిలో ఉండే ఓ దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. అయితే గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉన్నందువల్ల పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌కి ఎక్కువ సమయం పడుతోందట. త్వరలో రిలీజ్‌ గురించిన అప్‌డేట్‌ రానుందని సమాచారం. 

ఇటీవల విడుదలై, హిట్‌గా నిలిచిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. ‘మా ఊరి పోలిమేర’ (2021)కు ఈ చిత్రం సీక్వెల్‌. ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల, గెటప్‌ శీను, రాకేందు మౌళి ప్రధాన పాత్రలు పోషించారు. గౌరీ శ్రీను నిర్మించారు. ఈ సినిమాలో బ్లాక్‌ మ్యాజిక్‌ అంశాన్ని దర్శకుడు అనిల్‌ విశ్వనాథన్‌ ప్రస్తావించినప్పటికీ ప్రధానాంశం ఓ ఊరి పోలిమేరలో ఉన్న దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ఆ దేవాలయంలో ఏదో నిధి ఉందని ఆ నిధిని సాధించే ప్రయత్నాలు చేస్తుంటారు ప్రధాన తారలు. కాగా ‘మా ఊరి పోలిమేర 3’ కూడా ఉంటుంది. సో.. మూడో భాగం కూడా నిధి నిక్షిప్తం చేయబడి ఉందని భావిస్తున్న ఆ ఊరి పోలిమేరలోని గుడి చుట్టూ తిరుగుతుందని ఊహించవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు నటి పవిత్రా లోకేశ్‌ డైరెక్టర్‌. నటుడు వీకే నరేశ్‌ సమర్పణలో విజయకృష్ణ స్టూడియోస్‌ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి గత ఏడాది మేలో వివరాలు వెల్లడించారు మేకర్స్‌. మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది. 

మాస్‌ జాతర
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ బ్లాక్‌బస్టర్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్‌. ఈ సినిమాలో గంగమ్మ జాతర నేపథ్యంలో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారు. ఇంట్రవెల్‌ టైమ్‌లో వచ్చే ఈ జాతర ఓ పెద్ద హైలైట్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, శ్రీ వల్లిగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’  ఆగస్టు 15న విడుదల కానుంది.

మరోవైపు విశ్వక్‌ సేన్, నేహా శెట్టి జంటగా అంజలి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రదర్శకుడు కృష్ణ చైతన్య గంగానమ్మ జాతర నేపథ్యంలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేశారట . సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్‌ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌  కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top