Michael Movie Review: మైఖేల్‌ మూవీ రివ్యూ

Michael Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మైఖేల్‌
నటీనటులు: సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌషిక్‌,  విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మీనన్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వరుణ్‌ సందేశ్‌,అనసూయ తదితరులు
నిర్మాతలు:  భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు
సమర్పణ:  నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌
దర్శకత్వం: రంజిత్‌ జయకొడి
సంగీతం: శ్యామ్‌ సీఎస్‌
సినిమాటోగ్రఫీ: కిరణ్‌ కౌశిక్‌
విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023

కథేంటంటే..
మైఖేల్‌(సందీప్‌ కిషన్‌) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అనాథలా పెరుగుతాడు. పదేళ్ల వయసులో ముంబైలోనే అతి పెద్ద డాన్‌గా చలామణి అవుతున్న గురునాథ్‌(గౌతమ్‌ మీనన్‌)కు దగ్గరవుతాడు. రెండు సార్లు అతని ప్రాణాలు కాపాడడంతో మైఖేల్‌ని తన ప్రధాన అనుచరుడిగా నియమించుకుంటాడు. అయితే ఇది గురునాథ్‌ భార్య చారు(అనసూయ), కొడుకు అమర్‌ నాథ్‌(వరుణ్‌ సందేశ్‌)కు నచ్చదు. కొడుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కోపం ఇద్దరికీ ఉంటుంది. మరోవైపు తనపై దాడి చేసిన ఆరుగురిలో ఐదుగురిని దారుణంగా చంపేస్తాడు గురునాథ్‌.

మిగిలిన ఒక్కడు ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని చంపే బాధ్యత మైఖేల్‌కి ఇస్తాడు. ఢిల్లీ వెళ్లి మైఖేల్‌ ..అక్కడ తీర(దివ్యాంశ కౌశిక్‌)తో ప్రేమలో పడతాడు. అసలు తీర ఎవరు?     గురునాథ్‌ని చంపడానికి ప్లాన్‌ చేసిన ఆరో వ్యక్తి ఎవరు? బాస్‌ అప్పగించిన పనిని మైఖేల్‌ పూర్తి చేశాడా లేదా? గురునాథ్‌కు, మైఖేల్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీల పాత్ర ఏంటి అనేది తెరపై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
అనాథలా పెరిగే ఓ కుర్రాడు ఓ పెద్ద డాన్‌ని దగ్గరవ్వడం... ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఒకనొక దశలో అతనికే ఎదురు తిరుగుతాడు. తర్వాత ఒక ఫ్లాష్‌ బ్యాక్‌.. చివర్లో ఓ ట్విస్ట్‌... ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఇదే కాన్సెఫ్ట్‌కి మదర్‌ సెంటిమెంట్‌ జోడించి తెరకెక్కించిన కేజీయఫ్‌ చిత్రం రికార్డులు సృష్టించింది. బహుశా ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొనే మైఖేల్‌ కథను అల్లుకున్నాడేమో దర్శకుడు రంజిత్‌ జయకొడి.

కేజీయఫ్‌ తరహాలోనే హీరో గురించి ఓ వ్యక్తి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం.. పెద్ద పెద్ద డైలాగ్స్‌..ఎలివేషన్స్‌తో సినిమాను ప్రారంభించాడు. అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. కేజీయఫ్‌ తరహాలో తెరపై పండలేదు. పైగా అతి చేశారనే భావనే కలుగుతుంది తప్పా.. ఎక్కడా వావ్‌ మూమెంట్స్‌ ఉండవు. సినిమా చూసినంత సేపు కేజీయఫ్‌, పంజా, బాలు చిత్రాల తాలుకు సీన్స్‌ గుర్తుకు వస్తాయి. కథ, కథనంలో కొత్తదనం ఉండదు. రెట్రో స్టైల్లో సినిమాను తెరకెక్కించారు. విజువ‌ల్స్ ప‌రంగా, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించే సంద‌ర్భంలోనూ ద‌ర్శ‌కుడు హ్యండిల్ చేసిన ప‌ద్ధ‌తి ఆక‌ట్టుకుంటుంది. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ లాంటి స్టార్స్‌ని సరిగా వాడుకోలేకపోయారు. సినిమా నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇష్టపడేవారికి మైఖేల్‌ నచ్చే అవకాశం ఉంది. 

ఎవరెలా చేశారంటే.. 
మైఖేల్‌ పాత్ర కోసం సందీప్‌ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమంతా తెరపై కనపడింది. మైఖేల్ పాత్రకు సందీప్ కిషన్‌ సాధ్యం అయినంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్ లో ఆకట్టుకున్నాడు. నటుడిగా సందీప్ కిషన్‌ని ఒక మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఇందులో గౌతమ్‌ మీనన్‌ చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించాడు. గ్యాంగ్‌స్టర్‌ గురునాథ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తీర పాత్రకు దివ్యాంశ కౌశిక్ న్యాయం చేసింది. 

నెగిటివ్ షేడ్ ఉన్న అమర్‌నాథ్‌ పాత్రలో వరుణ్‌ సందేశ్‌ తనలోని మరో కోణాన్ని చూపించాడు.సెకండాఫ్‌లో వ‌చ్చే విజ‌య్ సేతుప‌తి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. గురునాథ్‌ భార్య చారుగా అనసూయ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం పర్వాలేదు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:  
(2.25/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top