ప్రముఖ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కుమార్తె, గాయని పారిస్ జాక్సన్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజుల గురించి తొలిసారి మాట్లాడారు. కౌమారదశలోనే డిప్రెషన్, మాదకద్రవ్యాల వ్యసనం, చికిత్స పొందని మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడినట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తన గత అనుభవాలను పంచుకున్నారు.
తండ్రి మరణం తర్వాత కుంగిపోయా
2009లో తన తండ్రి మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత తన జీవితంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయని పారిస్ చెప్పారు. అయితే అంతకుముందు నుంచే తనలో ఒంటరితనం, మానసిక ఆందోళన వంటి సమస్యలు ఉండేవని ఆమె పేర్కొన్నారు. చిన్నతనం నుంచే తనలో ఒకరకమైన ‘దీర్ఘకాలిక ఒంటరితనం’ ఉండేదని, అది తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ, మద్యం, డ్రగ్స్ వంటి సమస్యలకు దారితీసిందని వివరించారు.
15 ఏళ్లకే డ్రగ్స్..
తనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడే తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. అప్పటికే డ్రగ్స్, మద్యం వినియోగం మొదలైందని, చికిత్స పొందని మానసిక సమస్యలతో అవి కలిసిపోవడంతో పరిస్థితి మరింత విషమించిందని చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సూచనతో ఆమెను ఉటాలోని ఓ చికిత్సా కేంద్రానికి పంపించారు. అయితే అక్కడి అనుభవం తనకు మరింత మానసిక గాయాన్ని మిగిల్చిందని పారిస్ అన్నారు.
పీడకలలు వచ్చాయి
ఆ కేంద్రంలో గడిపిన కాలం తన మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని పారిస్ తెలిపారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు, మూడు సంవత్సరాల పాటు ఆ కేంద్రానికి తిరిగి వెళ్లాల్సి వస్తుందనే భయంతో పీడకలలు వచ్చేవని చెప్పారు. శారీరకంగా లేదా లైంగికంగా తనపై దాడి జరగలేదని, అయితే మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక వేధింపులను ఎదుర్కొన్నట్లు ఆమె పేర్కొన్నారు.
మళ్లీ ఆత్మహత్యాయత్నం
చికిత్స తర్వాత కూడా పారిస్ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. డ్రగ్స్ వినియోగం, మద్యం, నిద్రలేమి ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు. ఒక దశలో వారాల పాటు ప్రతి రాత్రి గంట లేదా రెండు గంటలకు మించి నిద్రపోలేదని వెల్లడించారు. అదే సమయంలో మరోసారి తన జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచనలకు లోనయ్యానని చెప్పారు.
ఆ సమయంలో తాను ఒక ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు తనలో ఎలాంటి భావనలు కలిగాయో కూడా వివరించారు. ఓ సారి మద్యంలో ప్రిస్క్రిప్షన్ మందులను కలిపి తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కొన్ని గంటల తర్వాత మేల్కొన్నానని, అప్పట్లో తన ప్రయత్నం విఫలమైందన్న నిరాశ కలిగిందని చెప్పారు.
మద్యం, డ్రగ్స్ తన జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో అర్థమై, చివరకు వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గత ఆరేళ్లుగా మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే వ్యసనం నుంచి బయటపడటం అంటే మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని పారిస్ స్పష్టం చేశారు. కొంతకాలం తర్వాత కూడా ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు తిరిగి రావడంతో మానసిక వైద్యుల సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం సంగీతంపై దృష్టి సారించిన పారిస్ తన రెండో ఆల్బమ్ ‘హ్యాపియెస్ట్ డే ఆఫ్ మై లైఫ్’ను ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ఈ ఆల్బమ్ తన మానసిక ఆరోగ్య ప్రయాణంలోని కొన్ని అనుభవాలను కూడా ప్రతిబింబిస్తుందని ఆమె తెలిపారు.


