
మేఘాలయ హనీమూన్ మర్డర్పై సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు గురించి త్వరలో వెండితెరపై చూపించనున్నారు. ఈ మేరకు 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో సినిమా తీస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఎస్‌పీ నింబావత్ ప్రకటించారు. ఇప్పటికే అందుకు కావాల్సిన అనుమతులు కూడా రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నామని ఆయన తెలిపారు.
తన సోదరుడి మృతి గురించి సినిమా తీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సచిన్ పేర్కొన్నారు. ఇందులో తప్పు ఎవరది అనేది ప్రపంచం తెలుసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు చేసేందుకు మరోకరు ముందుకు రాకూడదనే ఆలోచనతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యమని దర్శకుడు నింబావత్ తెలిపారు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని కూడా ఆయన అన్నారు. ఇండోర్, మేఘాలయలోనే సినిమా అంతా తెరకెక్కిస్తామన్నారు.

మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ స్టోరీ ఏంటి..?
రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్‌కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భర్తను హత్య చేసింది. రఘువంశీ మరణం తర్వాత ఆమె ప్రియుడు ఏమీ తెలియనట్లుగా అంత్యక్రియలకు వెళ్లి మృతుడి తండ్రిని ఓదార్చాడు.