Maha Samudram Review: ‘మహా సముద్రం’ మూవీ రివ్యూ

Maha Samudram Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : మహా సముద్రం
జానర్‌ : యాక్షన్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు :   శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌, రావు రమేశ్‌, జగపతిబాబు, రామ చంద్ర రాజు తదితరుల
నిర్మాణ సంస్థ : ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
దర్శకత్వం :  అజయ్ భూపతి
సంగీతం :  చేతన్‌ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
ఎడిటింగ్‌:  ప్రవీణ్
విడుదల తేది : అక్టోబర్‌ 14, 2021

ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్‌ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతోఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే
వైజాగ్‌ నగరానికి చెందిన అర్జున్‌(శర్వానంద్‌), విజయ్‌(సిద్ధార్థ్‌) ఇద్దరు ప్రాణ స్నేహితులు. అర్జున్‌ ఏదైనా బిజినెస్‌ ప్రారంభించడానికి ప్రయత్నించగా, విజయ్‌ మాత్రం పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు మహాలక్ష్మీ అలియాస్‌ మహా(అదితిరావు హైదరీ)తో ప్రేమలో ఉంటాడు విజయ్‌. పోలీసు ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అర్జున్‌ లైఫ్‌లోకి అనుకోకుండా వస్తుంది లా స్టూడెంట్‌ స్మిత(అను ఇమ్మాన్యుయేల్‌). కట్‌ చేస్తే.. వరుసగా జరిగే కొన్ని సంఘటనల వల్ల విజయ్‌ వైజాగ్‌ సిటీ నుంచి పారిపోవాల్సి వస్తుంది. అతని ఆచూకీ కోసం అర్జున్‌ ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పారిపోయిన విజయ్‌ తిరిగి మళ్లీ వైజాగ్‌కు వస్తాడు. అప్పటికీ అర్జున్‌ డ్రగ్స్‌ మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. అసలు విజయ్‌ వైజాగ్‌ సిటీని వదిలి ఎందుకు పారిపోయాడు? బిజినెస్‌ చేయాలనుకునే అర్జున్‌ స్మగ్లింగ్‌, డ్రగ్స్‌ దందాను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రాణ స్నేహితులైన అర్జున్‌, విజయ్‌ శత్రువులుగా ఎలా మారారు? విజయ్‌ ప్రాణంగా ప్రేమించిన మహాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో అర్జున్‌ ఎలా తోడుగా నిలిచాడు?అనేదే మిగిలి కథ.

ఎవరెలా చేశారంటే...
అర్జున్‌గా శర్వానంద్‌, విజయ్‌గా సిద్ధార్థ్‌ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శర్వానంద్ కెరీర్‌లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నిజాయితీగా ఉన్న వ్యక్తి అనుకోకుండా అక్రమ వ్యాపారాలు చెయ్యడం, స్నేహితుడి ప్రియురాలిని సొంత మనిషిలా చూసుకోవడం. అతని కూతురి ఆలనా పాలనా చూడడం. చివరకు తన ప్రేమను కూడా వదులుకోవడం.. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు. ఇక లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న సిద్ధార్థ్‌  నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న విజయ్‌గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.చాలా రోజుల తర్వాత కొత్త సిద్దార్థ్‌ను చూస్తున్నామన్న ఫీల్ కలిగించాడు. 

ఇక ఈ మూవీలో చాలా ప్రాధాన్యత ఉన్న మహా పాత్రలో అదితిరావు హైదరి ఒదిగిపోయింది. అందంతో పాటు చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. లా స్టూడెంట్‌గా అను ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపించింది. శర్వా, సిద్ధూల తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్రలు.. జగపతి బాబు, రావు రమేశ్‌లవి. చుంచూ మామ పాత్రలో జగపతి బాబు పరకాయ ప్రవేశం చేశారు. కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని నమ్మే గూని బాబ్జీ క్యారెక్టర్‌లో రావు రమేశ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్‌ ధనుంజయ్‌గా రామచంద్ర రాజు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 


ఎలా ఉందంటే..
ఆర్‌ఎక్స్‌ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. రెండో సినిమాకే భారీ కథను, అందుకు తగ్గట్లు హెవీ స్టార్ కాస్టింగ్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. క్యారెక్టర్స్ తో తాను అనుకున్న పాయింట్ ని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయానికే సమయం కేటాయించాడు. గూని బాబ్జీగా రావు రమేశ్‌ ఎంటర్‌ అయ్యాక కథ పరుగులు తీసుస్తుంది. ఫస్టాఫ్‌ అంత సోసోగా నడిపించిన డైరెక్టర్‌..  ఇంటర్వెల్ పాయింట్ కి పీక్ టైంకి తీసుకొచ్చి, ఓ ఫైట్‌ సీన్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగేలా చేశాడు.

కానీ సెకండాఫ్‌ ఆ అంచనాలను తగ్గట్లు కాకుండా వేరే ట్రాక్ తీసుకుని వెళుతుంది. అలా అని మరీ బోర్‌ ఏమి కొట్టదు కానీ ఇంటర్వెల్‌ వరకు ఉన్న కిక్‌ మాత్రం తగ్గుతుంది. సెకండాఫ్‌ కి వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఎమోషన్స్‌ తెరపై అంతగా వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా..  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ తో యాక్షన్స్‌ సీన్స్‌కి ప్రాణం పోశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top