హన్సిక చిత్రానికి ఊరట

నటి హన్సిక నటించిన 'మహా' చిత్రానికి చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాలు.. హన్సిక, శింబు నటించిన తాజా చిత్రం 'మహా'. జమీల్ దర్శకత్వంలో మదియళగన్ నిర్మిస్తున్నారు. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో చిత్రం విడుదలపై నిషేధం విధించాలని ఆ చిత్ర దర్శకుడు జమీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాత ఇంకా రూ.10 లక్షలు పారితోషికం బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు చిత్రం విడుదలపై నిషేధం విధించాలని కోరారు.
ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. నిర్మాత తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 'మహా' చిత్రానికి చిత్రంపై పూర్తి హక్కులు నిర్మాతకే చెందుతాయన్నారు. దర్శకుడి పారితోషికం గురించి సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని న్యాయమూర్తి జయచంద్రన్‌కు వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ చిత్రం విడుదలపై నిషేధం విధించలేమని, దర్శకుడికి చెల్లించాల్సిన పారితోషికం వ్యవహారంపై చిత్ర నిర్మాత రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు.