Superstar Krishna Career Records: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్‌ చేయలేరేమో!

Krishna Passes Away: Superstar Created Many Records In His Cinema Career - Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ(79) ఇకలేరు. తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు..కోట్లాది మంది ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.

చిత్రపరిశ్రమలో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేదు. మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రం అల్లూరి సీతారామరాజు కావడం తెలిసిందే. అలాగే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు.మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం. 40– 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్‌ కూడా అదే రేంజ్‌లో భారీగా జరిగింది. ఈ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. 

ఎన్నో మైలురాళ్లు దాటిన ఆయన దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి అందరిని అబ్బురపరచారు. 350 పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు విడుదల చేసిన హీరోగా కూడా కృష్ణ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు.

70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి.

1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్‌లను పరిచయం చేశాయి. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో కృష్ణ నెలకొల్పిన రికార్డులను మరే హీరో సాధించలేడనడం అతిశయోక్తి కాదు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top