
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అలరించారు. ఈ కోలీవుడ్ స్టార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలకు పైగా రాణిస్తున్నారు. తాజాగా అజిత్ సినీ పరిశ్రమకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్, జర్నీ గురించి ప్రస్తావిస్తూ లేఖ విడుదల చేశారు. తాను పడిక కష్టాలను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు. తన జర్నీ సులభంగా సాగలేదని లేఖలో రాసుకొచ్చారు.
అజిత్ తన లేఖలో ప్రస్తావిస్తూ.'సినిమా ఇండస్ట్రీలో 33 ఏళ్లు పూర్తిచేసుకున్నా. ఈసందర్భంగా మీతో చాలా విషయాలు పంచుకోవాలనిపించింది. గడిచిన ప్రతి ఏడాది నాకో మైలురాయితో సమానం. మరిన్ని ఘనతల కోసం ఎదురుచూస్తున్నా. మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. నా ప్రయాణం ఏమంతా సులభంగా సాగలేదు. ఎందుకంటే నాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. నా జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు నాకు పరీక్షపెట్టాయి. అయినా ఎప్పుడూ ఎక్కడా ఆగిపోలేదు. అన్ని భరిస్తూ పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంతో పనిని పూర్తి చేస్తున్నా. పట్టుదలే నేను నమ్ముకున్న మార్గం. అదే నా బలం' అని లేఖలో ప్రస్తావించారు.
'సినీ ఇండస్ట్రీలో ఎన్నోసార్లు ఓటములు చవిచూశా. అయినా ప్రతిసారీ మీ ప్రేమే నన్ను ముందుకు నడిపించింది. నా దగ్గర ఏమీ లేనప్పుడు, వైఫల్యాలు చుట్టుముట్టినప్పుడు మీరంతా నా వెంటే ఉన్నారు. ఇలాంటి గొప్ప అభిమానులు దొరకడం నా అదృష్టం. ఇక మోటారు రేసింగ్‌లోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. శారీరకంగా కూడా ఎన్నో గాయాలయ్యాయి. అక్కడ కూడా నన్ను ఎదగకుండా అడ్డుకునేందుకు చాలామంది యత్నించారు. ఎన్నోసార్లు అవమానించినా కానీ నేను పతకాలు సాధించే స్థాయికి ఎదిగా. ధైర్యంగా ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపించా' అని లేఖలో రాసుకొచ్చారు.
అంతేకాకుండా నా భార్య షాలిని లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదని తెలిపారు. అభిమానుల ప్రేమ గురించి మాటల్లో చెప్పలేను.. మీ ప్రేమను నేను ఎప్పుడూ వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించలేదని ప్రస్తావించారు. అందరిలా ఎక్కువ సినిమాలు తీయకపోయినా.. కానీ మీ ప్రేమను ప్రతిక్షణం ఆస్వాదిస్తూనే ఉంటానని రాసుకొచ్చారు. నా కెరీర్లో 33 ఏళ్లుగా నాలో ఉన్న లోపాలన్నీ అంగీకరించారు.. మీతో ఎప్పటికీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తానని.. రేసింగ్‌లోనూ దేశం గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చారు. తనను విమర్శించే వారికి కూడా అజిత్ కృతజ్ఞతలు తెలిపారు. విమర్శలు తనలో మరింత కసి, తపనను పెంచాయని అన్నారు.
AKs thanks giving note on his 33 rd year in the film industry pic.twitter.com/qy9O91Wkcd
— Ajithkumar Racing (@Akracingoffl) August 3, 2025