
జస్టిన్ ప్రభాకర్, రవీందర్ రెడ్డి, రాధాకృష్ణ కుమార్, మనోజ్ పరమహంస
‘ప్రభాస్‌గారు తాను పాన్ ఇండియా స్టార్ అనే భావనతో ఉండరు. సాధారణంగానే ఉంటారు. ప్రభాస్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో, ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో వాటిని మించేలా ‘రాధేశ్యామ్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ కేకే రాధాకృష్ణ కుమార్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘రాధేశ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ– ‘‘రాధేశ్యామ్’లాంటి ఒక మంచి కథని నేటి తరానికి అందిస్తున్న కృష్టంరాజుగారికి థ్యాంక్స్. ప్రభాస్‌కి కథ నచ్చాకే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం. నాలుగేళ్ల పాటు ‘రాధేశ్యామ్’ కోసం పని చేశాం. మా ఈ జర్నీలో కోవిడ్ కూడా చాలా నేర్పించింది. ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి పూర్తి చేయాలని యూనిట్ అంతా ఎన్నో నిద్రలేని రాత్రులు పని చేశాం. ఇటలీలో షూటింగ్‌లో ఉన్నప్పుడు నాకు, కెమెరామేన్ మనోజ్‌కి కరోనా రావడంతో 14రోజులు క్వారంటైన్‌లో ఉన్నాం. దీంతో 150మంది యూనిట్ 14 రోజుల పాటు ఇటలీలో షూటింగ్ లేకుండా ఉన్నారు. మనకు, మన నమ్మకానికి మధ్య జరిగే యుద్ధమే ఈ చిత్రకథ. 10 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారికి, ప్రేమంటే ఏంటి అని అర్థం తెలిసినవారందరికీ మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు.
కెమెరామేన్ పరమహంస మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ ఇమేజ్ నుంచి ప్రభాస్‌గారు బయటికొచ్చి చేసిన చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రతి షాట్ అదిరిపోవాలి, అత్యద్భుతంగా రావాలి అనేవారాయన.. అది నాకు ఓ పెద్ద బాధ్యతగా అనిపించి చేశాను. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీసిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘రాధేశ్యామ్’ చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇలాంటి సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన ప్రభాస్, రాధాకృష్ణ సార్‌లకు, నిర్మాతలకు థ్యాంక్స్.. వారి సపోర్ట్ లేకుంటే నేను లేను. ‘రాధేశ్యామ్’ సంగీతాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్. ‘‘అందమైన ప్రేమకథ ‘రాధే శ్యామ్’. డైరెక్టర్ అనుకున్న కథను స్క్రీన్ మీద చూపించే విషయంలో సాంకేతిక నిపుణులందరూ పూర్తి న్యాయం చేయాలి. ఈ సినిమాకి అందరూ బాగా పనిచేయడం వల్లే అద్భుతంగా వచ్చింది.. తప్పకుండా అందరికీ సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి అన్నారు.